ప్రాణభయంతో పారిపోయిన మాజీ మిస్ ఇరాక్!!

న్యూఢిల్లీ:

కొన్ని ముస్లిం దేశాల్లో మహిళల పరిస్థితి నేటికీ మెరుగు కాలేదు. వాటిలో ఇరాక్ ఒకటి. ఇక్కడ ఉగ్రవాదులు ప్రజలపై ఒక కన్నేసి ఉంచుతారు. ముఖ్యంగా మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా వేధిస్తారు. ఇరాక్ మొట్టమొదటి మిస్ ఇరాక్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. మాజీ మిస్ ఇరాక్ షిమా కాసిం అబ్దుల్ రహ్మాన్ ను హత్యచేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెదిరించారు. దీంతో ఆమె దేశం విడిచి పొరుగున ఉన్న జోర్డాన్ కి పారిపోవాల్సి వచ్చింది. షిమా మాజీ మిస్ ఇరాక్, ప్రఖ్యాత మోడల్. 2015లో ఆమె మిస్ ఇరాక్ గా ఎంపికైంది. ఇస్లామిక్ కట్టుబాట్లకు విరుద్ధంగా నడుచుకుంటున్నందుకు మరణశిక్ష తప్పదని ఇస్లామిక్ స్టేట్ అల్ లేవాంట్ ఉగ్రవాదులు హెచ్చరించారు. అప్పటి నుంచి తన ప్రాణాల భద్రత గురించి ఎంతో ఆందోళన చెందినట్టు షిమా చెబుతోంది. వెంటనే ఆమె స్వదేశం విడిచి జోర్డాన్ లో శరణార్థిగా ఆశ్రయం పొందింది. ఒక కుర్దిష్ వార్తా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనలాగా మరెందరో మహిళలకు హత్య చేస్తామని ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తాయని షిమా తెలిపింది.

గత వారం బాగ్దాద్ మధ్య ప్రాంతంలో తారా ఫరేస్ అనే 22 ఏళ్ల మోడల్, ఇన్ స్టాగ్రామ్ స్టార్ ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. గురువారం తన పోర్షె కారులో వెళ్తుండగా ఆమెపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆమె ఇస్లామ్ లో పేర్కొన్న విధంగా నడచుకోనందుకే మరణశిక్ష విధించినట్టు ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు.