/ప్రేమలేఖ/ ఒంటరి నక్షత్రం / అరసవిల్లి కృష్ణ /

బిజిలీ!
సూర్యుడు, పడమటి సంధ్యారాగాన్ని ఆలపిస్తున్నప్పుడు, కాలేజీ నుంచి ఇంటికి వచ్చే నీ ప్రియ సంతతి కోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటావు. నేను ఈ మహానగరంలో రాత్రి ఇచ్చే కూలికోసం, చెమట జ్ఞాపకమై ఎదురు చూస్తుంటాను. మనిద్దరం జ్ఞాపకాలను మోసుకుంటూ ఈ దేశంలో రెండు నగరాలలో సమాంతర రేఖలుగా ఉన్నాం. చాలా రాత్రులలో మన పల్లె నా ముఖచిత్రంపై వాలుతుంది, గోస్తనీ నది నీటిజాలు, తోటలో బొప్పాయి ముక్కలను తీంటూ రామచిలుకల మౌనభాషను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. గోధూళి వేళలో ఎర్రని సూర్యుని చూస్తూ ఇంటికి చేరడం జ్ఞాపకాల వరద.

బిజిలీ ఎలా ఉన్నావు? భీమ్లీ సముద్రతీరం జ్ఞాపకానికొస్తుందా, తేలుకుట్టి చనిపోయిన దుర్గ, చదువు భారమై బావిలో దూకిన కృష్ణవేణి, వారి విషాదాన్ని కాలేజీ ప్లేగ్రౌండులో కన్నీటి మధ్య చర్చించుకోవడం. భీమ్లీ సముద్రం అలానే ఉంది. భీమ్లీ అలానే ఉంది. సముద్రపు ఒడ్డున గ్రంథాలయం అలానే ఉంది. భీమ్లీ బస్టాండులో
తిన్న ఇడ్లీ రుచి అలానే ఉంది. సముద్రపు ఘోష కూడా అలానే ఉంది.

భీమ్లీ మన ఊరు, గోస్తనీ సముద్రంలో చివరి కలయిక, సమస్త ప్రకృతి అలానే ఉంది. కానీ మనిద్దరం అలానే ఉన్నామా? జీవన పరిమళాన్ని ఆస్వాదిస్తున్నామా!

జీవన విధ్వంసం మనల్ని రెండు తీరాలకు విసిరేసింది. కృష్ణానది ఒడ్డున నేను, గంగానది తీరంలో నీవు. మూడు దశాబ్దాలయింది నిన్ను చూసి. గంధపు రంగు పరికిణీలో చిర్నవ్వు మోముల్, ఆకాశాన్ని చూస్తాను. పేదరాసి పెద్దమ్మ ఆరబోసిన వెన్నెలను చూస్తాను… చివరిసారి కలిసినప్పుడు ప్రేమంటే ఏమిటి? అని అడిగావు. ప్రేమకు నిర్వచనం అప్పుడు తెలియలేదు. బహుశా నా తల్లిని ప్రేమించినట్టు నిన్ను ప్రేమించి ఉంటాను. మా అమ్మ నన్ను ఎలా ప్రేమించిందో అలాంటి ప్రేమను… నాలోని ప్రేమ భావనను ఇంతకంటే ఎలా వ్యక్తీకరించను.

బిజిలీ!
కులాలు, మతాలు, వర్గస్వభావం లేని ప్రేమను ఈనాటికీ సమాజం అంగీకరించడం లేదు. మనుషులింకా స్వచ్ఛమైన ప్రేమ ధారలో ముద్దగా తడవడం లేదు. అంతరాలు మరింత పెరిగాయి. శరీర వాంఛ మాత్రమే ప్రేమ అనే భావన ప్రచలితమౌతుంది. నాకెందుకో వర్షం గుర్తుకు వస్తుంది. ఆకాశం నిండా వర్ష మబ్బులు. వేయి దీపకాంతుల మెరుపులు. సముద్రంలో కురుస్తున్న వర్షాన్ని చూస్తూ భీమ్లీ డచ్చి బంగళాలో ఉద్వేగంతో కేరింతలు కొట్టిన వర్ష సమయాలు. భీమ్లీ నుంచి విశాఖ వరకు బస్సులో వర్షాన్ని చూస్తూ ప్రయాణం చేయడం. బాలచందర్ మరోచరిత్ర విషాదాన్ని సినిమా హాల్లో కూర్చొని చూడటం.

అంతా అద్బుతమైన ఓ స్వప్నం.

కలలన్నీ ధ్వంసమై చాలా కాలమైనా, మళ్ళీ అవే స్వప్నాల్ని నెమరువేసుకోవడం. నీ అమాయకపు మోమును స్వాప్నించుకోవడం. ఇంకా… ఇంకా… నీ రూపాన్ని నా రక్తంలో ఇకించుకోవడం. ఇది శరీర వాంఛకాదు. రెండు శరీరాల కలయిక కాదు.
రెండు హృదయాల కలయిక.

బహుశా పిల్లలు కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఉంటారు. వారితో కబుర్లు. నీకొక జీవితం అమరింది. నాకొక జీవితం అమరింది. ఇద్దరిదీ ఒక జీవితం కాకపోవడం ఓ విషాదం. ఆ విషాదం నీలో ఉందా!

బిజిలీ ఆకలేస్తుంది! చక్రపొంగలి తినాలనిపిస్తుంది. సపోట చెట్టు కింద నీవు తినిపించిన చక్రపొంగలి.. ఆ తీపి జ్ఞాపకం ఇంకా నా నాలికపై నుంచి చెరగనంటుంది. చెన్నై నుండి కలకత్తా వైపు వెళ్ళే రైలు చూస్తే జ్ఞాపకానికొస్తావు. వర్షం
కురిసినప్పుడు, ఎండ కాసినప్పుడు, చలి వేస్తున్నపుడు, ఆకలి వేస్తున్నప్పుడు జ్ఞాపకానికొస్తావు. జ్ఞాపకాలే జీవితమా.

కృష్ణా… నీవు ఇంకెవరినైనా ప్రేమిస్తావా? అని అడిగావు. అప్పుడు నా దగ్గర సమాధానం లేదు. గుండెకార్చిన కన్నీరు కనులలో కనబడదు. కాని ఇవాళ నెను ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని నా ఊరిని, ఈ మనుషుల్ని, అంతిమంగా విప్లవాన్ని. మనుషులలో సంఘర్షణ ఉంది. విప్లవం సాయుధం కాదు. విప్లవాన్ని ప్రేమించడమంటే తుపాకీని ప్రేమించడం కాదు. తుపాకీ చేసిన విధ్వంసాన్ని, అమరత్వాన్ని ప్రేమిస్తున్నాను.

ఆకలి, చెమట, శ్రమైక జీవన సౌందర్యాన్ని చూడటం అలవాటు చేశాయి. ఆ శ్రామిక సౌందర్యంలో మనుషులు ప్రేమలో బందీ కావడాన్ని ఆశిస్తున్నాను.

బిజిలీ! ఇది నా చివరి మొదటి ఉత్తరం. నా జ్ఞాపకాలలో శాశ్వతంగా ఉన్నావు. అమ్మను ఎలా ప్రేమించానో ఈ మనుషుల్ని ఎలా ప్రేమిస్తున్నానో నిన్ను అలానే ప్రేమిస్తున్నాను. ఆకలి, దారిద్ర్యం, హింస, ప్రతిహింసలేని ప్రపంచాన్ని కలగంటున్నాను.ఆ ప్రపంచంలో మనం, మన తర్వాత తరం పెరగాలని ఆకాంక్ష. బాగారాత్రయింది. ఆకాశంలో ఒంటరి నక్షత్రం కనిపిస్తుంది. ఆకాశంలోకి చూడు.

– కృష్ణ

(2006 లో ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైన ప్రేమలేఖ)