ఫిరాయింపు @ వన్ సైడ్.

ఎస్.కె.జకీర్.
తెలంగాణలో టిఆర్ఎస్ కు సంబంధించినంతవరకు ‘ఫిరాయింపుల’ ప్రక్రియ కేవలం ‘ఇన్ కమింగ్’ మాత్రమే. ‘ఔట్ గోయింగ్’ లేదు. పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తున్నందున అవతల ప్రత్యర్థుల శిబిరాలు కకావికలం అవుతుండగా, ఇటు సొంత పార్టీలోని ‘అసంతృప్తి జీవులు’ చిగురుటాకు వలె వణికిపోతున్నారు. తాము పార్టీ వీడడం లేదంటూ ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ నాయకులను కలుసుకొని ‘సంజాయిషీ’ ఇచ్చుకుంటున్నారు. మీడియా చేస్తున్న దుష్ప్రచారంగా కొట్టి పారేస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున డి.శ్రీనివాస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీ అధ్యక్షుడికి పంపిన లేఖ సామాన్యమైనది కాదు. కాకలు తీరిన డి.ఎస్.వంటి సీనియర్ రాజకీయనాయకుడు, రాజ్యసభ సభ్యుడినే ఉపేక్షించనప్పుడు మిగతా వారి వ్యవహారం పెద్దగా లెఖ్ఖలోకి రాదన్న సందేశం అధికార పార్టీ నాయకత్వం పార్టీ శాసన సభ్యులు, ఇతర హోదాలలో ఉన్న నాయకులకు ఈ లేఖ ద్వారా పంపింది. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కొందరు ‘అనుమానాస్పద’ శాసన సభ్యులు, నాయకుల ‘ చూపు’ ఇతర పార్టీల వైపు వెళ్తుంది. ఆ సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు. అందువల్ల పార్టీలో ఒక ‘ రెడ్ అలర్ట్ ‘ ను డి.ఎస్. ఎపిసోడ్ తో విధించినట్లయింది. రాబోయే ఎన్నిక‌ల్లో ఇత‌ర పార్టీలలో చేరే అవకాశం ఉందంటూ ‘ ప్ర‌చారంలో ఉన్ననాయకులకు ‘ టిఆర్ఎస్ అధినేత హెచ్చరిక జారీ చేసినట్లయింది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయ‌కులు ‘పార్టీ మారుతున్నారంటూ’ కొంతకాలంగా విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతున్నది. వ‌రంగ‌ల్ జిల్లా నుంచి కొండా దంప‌తుల‌తో పాటు మాజి ఉప ముఖ్య‌మంత్రి డాక్టర్ రాజ‌య్య, రెడ్యా నాయ‌క్, ఉమ్మడి కరీం నగర్ జిల్లా నుండి ప్ర‌స్తుత అర్టిసి చైర్మ‌న్ సోమార‌పు స‌త్య‌నార‌య‌ణ తదితరులపై ఈ ప్రచారం ఎక్కువగా సాగుతున్నది. వీరంతా కాంగ్రెస్ గూటికి చేరతారంటూ సోష‌ల్ మిడియాతో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా ప్ర‌చారం ఊపందుకున్నది. ముఖ్యంగా ఇత‌ర పార్టిల నుంచి వ‌చ్చిన మెజారిటి నాయకులు మళ్ళీ ‘సొంత గూటి’ బాట పట్టవచ్చునన్నది ప్ర‌చార మధ్య‌మాల్లో హోరెత్తుతున్న ప్రచార సారాంశం. ఈ ప్ర‌చారంలో నిజం ఉండవచ్చును, లేకపోవచ్చును. కానీ ‘పక్క చూపులు’ చూసే వారికి తాజ ప‌రిణామాలు హ‌డ‌లేత్తిస్తున్నాయి. సీనియ‌ర్ రాజ‌కీయ నాయకుడు డి.శ్రీనివాస్ కూడ తిరిగి సోంత పార్టికి వీడుతున్నారని ముందుగా ముమ్ముర ప్ర‌చారం జ‌రిగింది. డిఎస్ క‌ద‌లిక‌ల‌పై ‘నిఘా’ వేసిన నిజ‌మ‌బాద్ జిల్లా నాయకులు పార్టి వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు డిఎస్ పాల్ప‌డుతున్నారని నిర్ధారణకు వచ్చారు. కాంగ్రెస్ పార్టి పెద్ద‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారని వారు తెలుసుకున్నారు. దీంతో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించి డిఎస్ ను పార్టి నుండి స‌స్పేండ్ చేయ్యాలంటూ కేసిఆర్ కు లేఖ రాసి మిగతా నేత‌ల‌కు పరోక్షంగా హెచ్చ‌రిక‌ చేశారు .అయితే డిఎస్ క‌న్నా ముందుగా అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూప‌తి రెడ్డిని కూడ స‌స్పేండ్ చేయ్యలంటూ సిఎం కు లేఖ రాసారు. అది ఇంకా పెండింగులో ఉన్నది. డిఎస్ లాంటి సినియ‌ర్ నాయ‌కున్నే ఉపేక్షించ‌క పోవ‌డంతో ‘ ఫిరాయింపు ప్ర‌చారం’లో ఉన్న నేత‌లంతా, త‌మ‌పై వ‌స్తున్న ప్ర‌చారంలో వాస్తవాన్ని పార్టి పెద్ద‌ల‌కు చేప్పుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ”మ‌నం పార్టి మార‌డం కాదు, వాళ్లే సాగ‌నంపేలా ఉన్నార‌”న్న అనుమానంతో న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. హైదరాబాద్ వ‌చ్చి పార్టీ పెద్ద‌ల‌ను క‌లిసి త‌మ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ‘ప్ర‌చారంలో మొద‌టి వ‌రుస‌లో ఉన్న’ కొందరు నాయకులు మంత్రి కేటిఆర్ ను కలిసి తమ బాధను, తమపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ ని ఇరుకున పెడదామ‌నుకున్న కాంగ్రెస్ నాయకుల పప్పులు ఉడకవు అని కేసీఆర్ ఈ ఝలక్ ఇచ్చినట్టు తెలియవచ్చింది,. కొన్ని రోజులుగా కొండ దంపతులు కాంగ్రెస్ లో చేరతారు అని వినిపిస్తునాయి.అయితే దీనిఫై స్పందించిన కొండ దంపతులు వాటిని ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ- మేం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. అయితే అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనన్నారు. కొండా దంపతులు రాహూల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి.వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వ్య‌వ‌హార శైలితో పార్టీలో దుమారం రేగుతున్న మాట నిజం. కేసీఆర్ కు కోపం తెప్పిస్తున్న మాట నిజం. ముఖ్యంగా స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూతురు సుష్మితాప‌టేల్‌ను బ‌రిలోకి దింపుతామ‌ని కొండా సురేఖ బహిరంగంగానే ప్ర‌క‌టించారు. కొండా దంప‌తులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని ఆ తర్వాతే పార్టీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య‌కు ఎర్త్ పెట్టేందుకు డిప్యూటీ సీఎం క‌డియం ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న‌ది జిల్లాలో ఓపెన్ టాక్‌. హైబ్రిడ్ వేషాలు వద్దంటూ కొండా సురేఖ ప్రత్యర్థులను సూటిగా హెచ్చరించడాం చర్చనీయాంశమైంది. ‘నాయకత్వ లక్షణాలనేవి పుట్టుకతో రావాలి. ఈ విషయంలో కొండా మురళి ఒరిజినల్‌ బ్రీడ్’ అని ఆమె తేల్చేశారు. హైబ్రిడ్‌ మనుషుల మాదిరిగా వచ్చి రాని వేషాలు వేస్తే సహించేది లేదని సురేఖ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో కొంతమంది మీసాలు మెలేస్తున్నారని, కొత్తగా మీసాలు మెలేస్తే ఉన్నవి ఊడతాయని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌ ఎల్‌బీ నగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వివిధ మత పెద్దల సమక్షంలో జరిగిన ఈద్‌ మిలాప్‌ కార్యక్రమం సందర్బంగా జూలై 3 న కొండా సురేఖ తమ పార్టీలోని ప్రత్యర్థులపై విరుచుకు పడ్డారు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్‌గా పేరుపడిన సురేఖ, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న ఆమెను మళ్లీ కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు సీనియర్లు పావులు కదుపుతున్నట్లు ఓ వైపు వార్తలొస్తున్నాయి.