ఫ్లిప్‌కార్ట్‌పై ‘ఆమ్వే’ దావా!!


న్యూఢిల్లీ:
దేశీయంగా ఆన్‌లైన్‌ అమ్మకాల్లో దూసుకుపోతున్న ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు డైరెక్ట్ సెల్లింగ్ దిగ్గజ సంస్థ ఆమ్వే షాక్‌ ఇచ్చింది. భారతీయ ఈ-కామర్స్ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లిప్‌కార్ట్‌ తమ ఉత్పత్తులను అక్రమంగా అమ్ముతోందని ఆమ్వే ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల ఉత్పత్తులు అమ్మడానికి ముందు ఆ సంస్థల అనుమతి తీసుకోవాలని 2016 లో కేంద్రం జారీ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించిందని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ ఆన్ లైన్ లో ‘అనధికార’ అమ్మకాలు జరుపుతోందని ఆరోపించింది. తమ ముందస్తు అనుమతి లేకుండా అనధికారికంగా తమ ఉత్పత్తులను విక్రయిస్తోందని పిటిషన్‌ లో తెలిపింది. తమ ఉత్పత్తుల మూతలపై ముద్రించిన యూనీక్ కోడ్‌, సిల్వర్‌ ఫాయిల్‌ సీల్స్‌ను మార్చేసి తుడిపేసి అక్రమ అమ్మకాలకు పాల్పడుతోందని ఆమ్వే తెలిపింది. డైరెక్ట్‌ సెల్లర్ల ప్రయోజనాలు, జీవనోపాధిని కాపాడటం, వ్యాపార ప్రాథమిక పునాదిని కాపాడుకోవడం, వినియోగదారుల భద్రతను కాపాడేందుకు ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు పంపించినా స్పందించక పోవడంతో కోర్టు జోక్యం చేసుకోవాలని ఆమ్వే కోరింది.’ఆమ్వే” డైరెక్ట్ సెల్లర్లు థర్డ్ పార్టీ షాప్ లేదా ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు జరపరాదు. కానీ కొందరు సెల్లర్లు తమ అమ్మకాలు పెంచుకొనేందుకు ఆన్ లైన్ లో ఆమ్వే ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. గతంలో ఆమ్వే స్నాప్‌డీల్‌, ఆన్‌లైన్‌ ఫార్మా సంస్థ 1ఎంజీ.కామ్‌పై కేసులు నమోదు చేసింది. వెంటనే రెండు సంస్థలు ఆమ్వే ఉత్పత్తులను తమ లిస్టింగ్ నుంచి తొలగించాయి.