ఫ్లోటింగ్ వడ్డీరేట్లపై ఏం చేస్తారు?

న్యూఢిల్లీ:

రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీరేట్ల తగ్గింపు ప్రణాళిక గురించి వినియోగదారులకు తెలియజెప్పాలని సుప్రీంకోర్ట్ ఆర్బీఐకి సూచించింది. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ కె ఎం జోసెఫ్ ల సుప్రీంకోర్ట్ ధర్మాసనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది. మార్కెట్లో వడ్డీరేట్లు పడిపోయినప్పటికీ చాలా కాలంగా రుణాలపై వడ్డీరేట్లు తగ్గించక పోవడాన్ని ప్రశ్నిస్తూ గత ఏడాది అక్టోబర్ లో మనీలైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. మార్కెట్ వడ్డీ రేట్లు పెరగగానే రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు పెంచుతారని.. కానీ వడ్డీరేట్లు తగ్గినప్పటికీ ఫ్లోటింగ్ రేట్లు చాలా కాలం పాటు ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు. డిసెంబర్ 26, 2017న ఆర్బీఐ ఈ అంశం పరిశీలనలో ఉన్నట్టు జవాబిచ్చింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ప్రణాళికను ఆర్బీఐ తెలియజేయలేదన్న పిటిషనర్ వాదన విన్న కోర్టు వెంటనే ఈ వ్యవహారం గురించి తెలియజేయాలని ఆర్బీఐని ఆదేశించింది. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించింది.