ఫ్లోరిడాను వణికిస్తున్న హరికేన్ ‘మైకెల్’.

న్యూయార్క్:

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం తుపాను ప్రమాదం అంచున వణికిపోతోంది. ఫ్లోరిడాలోని ఆగ్నేయ తీరాన్ని అత్యంత శక్తివంతమైన హరికేన్ మైకెల్ తాకనుంది. ఐదు దశల సాఫిర్-సింప్సన్ స్కేల్ పై హరికేన్ మైకెల్ ను కేటగిరి 4 (అతి ప్రమాదకరం)గా తెలిపారు. మైకెల్ బలపడి గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి ఉత్తరంగా ప్రయాణిస్తోంది. కేవలం 40 గంటల్లోనే సాధారణ తుపాను కేటగిరీ 4కి చేరడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఫ్లోరిడాలోని పాన్ హ్యాండిల్ దగ్గర హరికేన్ మైకెల్ తీరాన్ని దాటనుంది. తుపాను ప్రభావిత ప్రాంతాలైన గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.హరికేన్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 230కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. ఈదురుగాలులకు పైకప్పులు ఎగిరిపోతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సముద్ర నీటిమట్టాలు అకస్మాత్తుగా 14 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన హరికేన్ అని ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ తెలిపారు. ఫ్లోరిడాలోని కనీసం 20 కౌంటీలలో నివసించే 2.1 మిలియన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాల్సి ఉంటుంది. ఫ్లోరిడా రాష్ట్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు.