బంగారంలో పెట్టుబడి పెట్టాలా? వద్దా?

హైదరాబాద్;
కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఔన్స్ బంగారం ధర 1,250 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. బంగారం బలహీన పడటానికి డాలర్ బలపడటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే ఈ ఒరవడి ఎంత కాలం కొనసాగుతుంది? ఈ సమయంలో బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చా? అని చాలా మంది సందేహిస్తున్నారు. దీనికి నిపుణులు ఇస్తున్న సలహాలు ఇలా ఉన్నాయి. బంగారం మార్కెట్లో అనిశ్చిత మరికొంత కాలం కొనసాగడం ఖాయమని చెబుతున్నారు కమోడిటీ మార్కెట్ నిపుణులు. పెట్టుబడి పెట్టే ముందు అత్యంత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. అమెరికా డాలర్ నేరుగా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. బలపడుతున్న డాలర్ బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలాగే మరొక కీలక అంశం యుఎస్ ట్రెజరీ ఈల్డ్. ఇందులో ఏ మాత్రం పెరుగుదల ఉన్నా స్వల్పకాల ఇన్వెస్టర్లు బంగారానికి బదులు బాండ్లు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు కనుక బంగారం ధరలు పెరగడం కష్టం. అలాగే రాబోయే కొద్దినెలల్లో ప్రకటించనున్న అమెరికా వడ్డీ రేటు కూడా బంగారం ధరల నిర్ణయంలో ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా వడ్డీ రేట్లు పెంచే సూచనలు ఉన్నందువల్ల బంగారం ధరలు పెరిగే అవకాశాలు లేవు. మరికొంత కాలం బంగారం ధరలు ఇదే తరహా ఒత్తిడిని ఎదుర్కోనున్నాయని చెబుతున్నారు. అందువల్ల ధరలు మరింత తగ్గుతాయి తప్ప పెరిగే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదని అభిప్రాయ పడుతున్నారు.