‘బతుకమ్మ’ చీరల పంపిణీకి ఈసీ బ్రేక్‌.

హైదరాబాద్‌:

బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్‌ పడింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నందున చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం సరికాదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపగా.. పరిశీలించిన సీఈసీ చీరల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. వాస్తవానికి ఈ నెల‌ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ ఏడాది మొత్తం 95లక్షల చీరలను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. ప్రత్యేకంగా మరమగ్గాలపై చీరలను తయారు చేయించారు. 49.18 లక్షల చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరాయి. రూ.280 కోట్ల వ్యయంతో 80 రంగుల్లో జరీ అంచు పాలిస్టర్‌ చీరలను తయారు చేయించారు. ఇటీవలే మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో చీరల నమూనాల ప్రదర్శనను ప్రారంభించిన విషయం తెలిసిందే.