బద్దలైన లైంగిక వేధింపుల పుట్ట.

 

ముంబయి:
బాలీవుడ్ లో రోజుకో లైంగిక వేధింపుల పుట్ట బద్దలవుతోంది. నటుడు నానా పటేకర్, దర్శకుడు వికాస్ బెహల్, రచయిత చేతన్ భగత్ లపై ఆరోపణల కలకలం సద్దుమణగకుండానే తాజాగా మరో నటుడు రజత్ కపూర్ తనను లైంగికంగా వేధించారని మరో మహిళ ఆరోపించింది. జర్నలిస్ట్ అయిన తను రజత్ కపూర్ ని ఇంటర్వ్యూ చేస్తుండగా మధ్యలో తన శరీర కొలతలు అడిగాడని తెలిపింది. ఈ ఆరోపణలు రాగానే రజత్ కపూర్ తన ట్విట్టర్ ఖాతాలో క్షమాపణలు కోరాడు. కపూర్ ట్వీట్ చేసిన క్షమాపణ ఇలా సాగింది. ‘నేను జీవితంలో ఇప్పటి వరకు హుందాగా వ్యవహరించేందుకు ప్రయత్నించాను. ఏది మంచో అదే చేయాలనుకున్నాను. కానీ ఎప్పుడైనా నా చర్యలు, మాటల ద్వారా ఎవరికైనా కష్టం కలిగినా, ఇబ్బంది కలిగించినా, బాధ పడేలా చేసినా వారిని క్షమాపణ కోరాలనుకుంటున్నాను. నా వల్ల ఒకరికి బాధ కలిగినందుకు నేను ఎంతో చింతిస్తున్నాను. దయచేసి మనస్ఫూర్తిగా చెబుతున్న నా క్షమాపణలు అంగీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు నా పని కంటే ముఖ్యమైందీ ఏదైనా ఉందంటే అది మంచి మనిషిగా ఉండటం. అందుకోసం ఇప్పటి కంటే ఎక్కువ ప్రయత్నిస్తాను.రజత్ ట్వీట్ పై ట్విట్టర్ యూజర్లు పలు రకాలుగా స్పందించారు. కొందరు అతనిని నిర్దోషిగా భావించి వెనకేసుకొస్తే మరి కొందరు ఆయన తప్పు చేసే ఉంటాడని అంటున్నారు. ఒక యూజరైతే మీరు ముగ్గురు మహిళలను వేధించారనే ఆరోపణలు వచ్చాయి. ఇంకెందరిని వేధించారో? మీరో ‘సీరియల్ హెరాసర్’ అని విమర్శించాడు.