బయటపడ్డ విభేదాలు… ఎమ్మెల్సీలకు అవమానం. -సమావేశం రద్దు చేసిన మంత్రి.

ఎస్‌.కె. జకీర్‌:
ఆకలేస్తే కోపం వస్తుంది… అసహనం వస్తుంది… ఇందుకు ఎమ్మెల్సీలకు మినహాయింపు లేదు. సాక్షాత్తు ముగ్గురు ఎమ్మెల్సీలు ఆకలితో, అసహనంతో వెళ్లిపోయిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండం తొగర్రాయి గ్రామంలో చోటుచేసుకున్నది. తొగర్రాయిలో గ్రామపంచాయతీ ఓ అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది. పెద్దపల్లి, జూలపెల్లిల్లో కార్యక్రమం ముగించుకున్న మంత్రి ఈటెల రాజేందర్‌ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు నేరుగా తొగర్రాయికి వెళ్లారు. ముందుగా వెళ్లిన ఈటెల రాజేందర్‌ను వెంటేసుకొని అదే గ్రామంలో ఉండే జిల్లా రైతు సమితి అధ్యక్షులు కోట రాంరెడ్డి ఇంటికి వెళ్లారు. ఈటెల రాజేందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, రాంరెడ్డిలు అక్కడే భోజనం చేశారు. అప్పటికి కొద్దిగా ఆలస్యంగా చేరుకున్న ముగ్గురు ఎమ్మెల్సీలను భోజనానికి పిలువకపోవడంతో సమావేశం వద్దనే ముగ్గురు ఎమ్మెల్సీలు వేచియున్నారు. భానుప్రసాదరావు, సుధాకర్‌రెడ్డి, నారదాసులతో పాటు టిస్ఎస్‌టిస్ఎస్‌ చైర్మన్‌ రాకేష్‌లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత సమావేశం వద్దకు చేరుకున్న ఈటెల రాజేందర్‌ ఆ నలుగురు వెళ్లిపోయిన విషయం గ్రహించి ప్రసంగించకుండానే ఆయన సమావేశాన్ని రద్దు చేసుకొని ఇంటిదారి పట్టారు. అధికారపార్టీలో నాయకుల మధ్య ఉన్న విభేధాలు భోజనం వద్ద బయటపడ్డాయంటూ పలువురు వ్యాఖ్యానించారు. అయితే నలుగురు నాయకులు తొగర్రాయికి వస్తున్న విషయం తెలియకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని కొందరు అంటుండగా తెలిసీ ఆ నలుగురికి కటింగ్‌ ఇచ్చేందుకే మంత్రి భోజనానికి ఆహ్వానించకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నాయకులకు ఆకలైతే పార్టీలో ప్రళయం ఏర్పడిందని అంటున్నారు. అధికారపార్టీలో… అందరూ ఒకే పార్టీలో ఉండడం వల్ల బయటికి చెప్పుకుంటే పరువు బజారుపాలవుతుందని ఎవరికి వారు కిక్కురుమనకుండా ఉండిపోయారు.