బాల్కొండ బరిలో ప్రశాంత్ సోదరి ? కాంగ్రెస్ పరిశీలనలో రాధికా వేముల అభ్యర్థిత్వం!! టిఆర్ఎస్ కు ‘గండం’ !!

నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాధికా వేముల అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత రెడ్డి సోదరి రాధిక ప్రభుత్వ ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిల్ బాల్కొండ టికెట్టు ఆశిస్తున్నా సంగతి తెలిసిందే. అనిల్ కన్నా రాధిక వైపునే ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా టిఆర్ఎస్ శ్రేణులు మొగ్గు జూపుతున్నట్టు టిపిసిసి సర్వేలో వెల్లడైనట్టు తెలియవచ్చింది. బాల్కొండలో ప్రశాంత రెడ్డి తండ్రి దివంగత సురేందర్ రెడ్డికి గొప్ప పేరు ఉన్నది. నీతి, నిజాయితీకి, క్రమశిక్షణకు సురేందర్ రెడ్డి మారుపేరుగా చెప్పుకుంటారు.కేసీఆర్ కు సురేందర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. శ్రేయోభిలాషి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నిర్మాణంలోనూ, ఆ పార్టీ విస్తరణలోనూ సురేందర్ రెడ్డి క్రియాశీల భూమిక పోషించారు. సురేందర్ రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హాజరయ్యారు. సురేందర్ రెడ్డి ఆశయాలకు ఆయన కుమారుడు, టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి తూట్లు పొడిచారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

టిఆర్ఎస్ కార్యకర్తలలోనూ ప్రశాంత రెడ్డి పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా తమ సర్వేలలో తెలిసిందని టిపిసిసి నాయకుడొకరు చెప్పారు. దివంగత సురేందర్ రెడ్డికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజాభిమానాన్ని ఓట్లుగా మలచుకోగల సామర్ధ్యం ఆయన కూతురు రాధికకు ఉన్నట్టుగా కాంగ్రెస్ నాయకుల అంచనా. రాజకీయ కుటుంబానికి చెందిన ఆమె ఉన్నత విద్యావంతురాలు. మంచి వక్తగా గుర్తింపు పొందారు. ఆమె కాంగ్రెస్ తరపున బాల్కొండ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం బాల్కొండ, ఆర్మురు నియోజకవర్గాలపై కూడా ఉంటుందని అంచనా. ఇలాంటి నూతన మహిళా అభ్యర్థులు కాంగ్రెస్ కు అవసరమని రాహుల్ గాంధీ ఇప్పటికే టిపిసిసికి తెలిపినట్టు తెలుస్తున్నది. అభ్యర్థుల ఎంపికలో మునుపెన్నడూ లేని ‘వడపోత’ కాంగ్రెస్ లో కనిపిస్తున్నది. ప్రతి సీటు కీలకమేనని ఇటీవల పర్యటనలో రాహుల్ గాంధీ టిపిసిసి అధ్యక్షునికి చెప్పారు. బాల్కొండ నుంచి రాధికా వేముల కు కాంగ్రెస్ పక్షాన టికెట్టు దాదాపు ఖరారయినట్టు తెలియవచ్చింది.’రెడ్డి’ సామాజిక వర్గం అభ్యర్థే బాల్కొండలో టిఆర్ఎస్ ను చిత్తు చేయవచ్చునని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిల్ ను బుజ్జగించి అసమ్మతి తలెత్తకుండా చూడాలని కాంగ్రెస్ నాయకులు కసరత్తు చేస్తున్నారు. తనను కాంగ్రెస్ నాయకులెవరూ సంప్రదించలేదని, అయితే టికెట్టు లభిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగే అంశంపై నిర్ణయం తీసుకుంటానని రాధిక అంటున్నారు.