బిజెపి,ఎంఐఎం లతో కేసీఆర్ ఒప్పందం.ఉత్తమ్ ఆరోపణ.

హైదరాబాద్.
రెండు వారాల్లో హైద‌రాబాద్‌కు రాహుల్‌ గాంధీ రానున్నట్టు చెప్పారు.15 రోజుల‌లో హైద‌రాబాద్ లో డివిజ‌న్ క‌మిటీలు సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయాలని కోరారు.
న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షులుగా అంజ‌న్‌కు బాధ్య‌త‌ల ను స్వీకరించారు.హైద‌రాబాద్ న‌గ‌రాన్ని విశ్వ న‌గ‌రంగా తీర్చిదిద్దిన ఘ‌త‌న కాంగ్రెస్ పాల‌కుల‌దేన‌ని, హైద‌రాబాద్‌కు చెందిన ఆదాయాన్ని తెలంగాణ ఆదాయంగా చేయ‌డంలో కాంగ్రెస్ చేసిన కృషి వ‌ల్ల‌నే నేడు తెలంగాణ ధ‌నిక రాష్ట్రంగా ఉంద‌ని హైద‌రాబాద్‌ను అన్ని ర‌కాలుగా ముందుకు తీసుకుపోతే తెలంగాణ వ‌చ్చిన త‌రువాత కేసిఆర్ పాల‌న‌లో హైద‌రాబాద్ అన్ని విధాలుగా అధ్వాన్నంగా మారింద‌ని, కేసిఆర్ పాల‌న పిచ్చి తుగ్ల‌క్ పాల‌న‌ను మించిపోయింద‌ని టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. అటు మోడీ, ఇటు కేసిఆర్‌ల‌పైన విరుచుప‌డ్డారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ముఖ్య‌మంత్రి కేసిఆర్ చెంచాగిరి చేస్తున్నార‌ని, ప్ర‌ధానిని చూసి భ‌య‌ప‌డి ఆయ‌న అడుగుల‌కు మ‌డుగులొత్తుతున్నార‌ని, కేసిఆర్ దేశంలో ఏ ముఖ్య‌మంత్రి చేయ‌నంత‌గా మోడికి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని అన్నారు. దేశంలో బిజెపి ముఖ్య‌మంత్రుల‌కంటే ముందుగానే నోట్ల ర‌ద్దు, జిఎస్‌.టిల‌కు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని, రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌పతి ఎన్నిక‌ల‌లో బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చార‌ని మోడీకి చెంచాగిరి చేయ‌డంలో కేసిఆర్ త‌రించిపోతున్నార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు.
హైద‌రాబాద్ అంటే దేశంలోని అనేక ప్రాంతాల వాసులు నివసిస్తున్న ఒక మినీ భార‌త్ అని అయితే గ‌తంలో ఉద్య‌మం పేరుతో కేసిఆర్ ఇక్క‌డ ఉన్న సెట్ల‌ర్ల‌ను ఎలా అవ‌మాన‌ప‌రిచిండో, ఎంత ఘోరంగా వారిని ఇబ్బందులు పాలు చేశారో ఇక్క‌డ ఉన్న సెట్ల‌ర్లు ఎవ‌రు మ‌రిచిపోలేద‌ని, సెట్ల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలోను, వారిని గుర్తించ‌డంలోను కాంగ్రెస్ శ్ర‌మ‌ను కూడా సెట్ల‌ర్లు మ‌రిచిపోలేద‌ని అన్నారు. హైదరాబాద్‌లో నివ‌సిస్తున్న సెట్ల‌ర్ల‌కు అన్ని ర‌కాలుగా భ‌ద్ర‌త కల్పిస్తామ‌ని, వారికి పార్టీలోను అన్ని విభాగాల‌లోను త‌గిన ప్రాధాన్య‌త క‌ల్పిస్తామ‌ని ఆయ‌న అన్నారు. అంతేకాకుండా మ‌రో రెండు వారాల‌లో ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ హైద‌రాబాద్‌కు రానున్నార‌ని ఆయ‌న రాగానే ఇక్క‌డ అన్ని వ‌ర్గాల వారితో మాట్లాడించి కాంగ్రెస్ భ‌రోసా క‌ల్పిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.
హైద‌రాబాద్‌లో ఎం.ఐ.ఎంతో గ‌తంలో కాంగ్రెస్ కొంత సానుకూల ధృక్ప‌దంతో ఉన్నామ‌ని కానీ ఇప్ప‌డు పాత బ‌స్తీలో ఎం.ఐ.ఎంతో హోరాహోరీ పోరుకు సిద్దం ఉండాల‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. బిజెపి, ఎం.ఐ.ఎం రెండు మ‌త‌త‌త్వ పార్టీలని అవి రెండు లోపాయికారి ఒప్పందాల‌తో దేశ‌వ్యాప్తంగా క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని, పాత బ‌స్తీలో ఈ సారి ఎం.ఐ.ఎం. ఓట‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని అన్నారు. బిజెపి పాల‌న‌లో మైనార్టీల‌కు ఎలాంటి ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, బిజెపి మ‌త‌త‌త్వాన్ని రెచ్చ‌గొట్టి, మైనారిటీల‌పైన నిమ్న వ‌ర్గాల‌పైన దాడులు చేసి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతుంద‌ని, దేశంలో ఒక భ‌యాన‌క వాతావార‌ణాన్ని సృష్టిస్తుంద‌ని విమర్శించారు.
తెలంగాణ‌లో కేసిఆర్ పిచ్చి తుగ్ల‌క్ పాల‌న‌ను మించిపోయార‌ని ఒక్క విధానం కూడా స‌క్ర‌మంగా లేద‌ని, ఒక‌సారి స‌చివాల‌యాన్ని కూల్చుతానంటాడు, ఉస్మానియా ఆసుప‌త్రి కూల్చుతానంటాడు, హుసేన్ సాగ‌ర్ శుద్ది అంటాడు, స్కై ఫ్లై ఒవ‌ర్ల‌ను క‌డుతా అంటాడు, కానీ ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే ఒక్క ప‌నిచేయ‌లేద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హాయాంలో అంత‌ర్జాతీయ విమాశ్ర‌యం క‌ట్టించామ‌ని, ఔట‌ర్ రింగ్ రోడ్డు, కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను న‌గ‌రానికి తెచ్చామ‌ని, ఫై్ ఓవ‌ర్ల‌ను నిర్మించామ‌ని, మెట్రో రైల్ నిర్మాణం, ఐ.టి, ఫార్మా కంపెనీలు నిర్మాణం చేసి ఉపాధి, ఉద్యోగాలు క‌ల్పించామ‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లో కేసిఆర్‌ను, దేశంలో బిజెపిని ఒడించి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డానికి కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అందుకోసం వారం రోజుల‌లో న‌గ‌ర పూర్తి క‌మిటీల‌ను, 15 రోజుల‌లో 15 నియోజ‌క‌వ‌ర్గాల‌లో బూత్ క‌మిటీల‌ను పూర్తి చేయాల‌ని, సంస్థాగ‌త ఎన్నిక‌ల‌ను పూర్తి చేసి పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ విజ‌యానికి న‌గ‌ర‌మే నాంది ప‌ల‌కాల‌ని ఆయ‌న అన్నారు. సి.ఎల్‌.పి నాయ‌కులు జానా రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో నియంత‌ల పాల‌న సాగుతుంద‌ని, నేడు న‌గ‌రంలో కోటి మందికి స‌క‌ల సౌక‌ర్యాలున్నాయంటే అది కాంగ్రెస్ పాల‌కులు గ‌తంలో చేసిన ప‌నులేన‌ని ఆయ‌న వివ‌రించారు. హైద‌రాబాద్‌లో విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి రంగాల అభివృద్ది కాంగ్రెస్ పాల‌కుల దూర‌దృష్టికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు.
మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ హైద‌రాబాద్‌లో ఉన్న కొన్ని వ‌ర్గాలు కాంగ్రెస్‌కు దూర‌మ‌య్యాయ‌ని వాటిని గుర్తించి అంజ‌న్ కుమార్‌యాద‌వ్ తిరిగి పార్టీ వైపు తేవాల‌ని అన్నారు. తాను కేంద్రంలో మంత్రిగా ఉన్న‌ప్పుడే 4 వేల కోట్లతో మెట్రో రైల్ మంజూరు చేశామ‌ని, హైద‌రాబాద్ అభివృద్ది కాంగ్రెస్ ఘ‌న‌తేన‌ని అన్నారు. ఎ.పి.సి.సి అధ్య‌క్షులు ర‌ఘువీరారెడ్డి మాట్లాడుతూ క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేశాం, ఇక్క‌డ టిఆర్ ఎస్‌, బిజెపి ఒక్క‌ట‌య్యారని వారికి చిత్తుగా ఓడించి తెలంగాణ‌లో, డిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని అన్నారు. రాబోయే ఎన్నిక‌ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా కాంగ్రెస్ కీల‌క భూమిక పోషిస్తుంద‌ని అన్నారు. ఎం.పి కెవిపి రాంచంద్ర‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అమ్ముల‌పొదిలో వంద‌లాది అస్త్రాలున్నాయ‌ని అనేక అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశామ‌ని వాటిని ప్ర‌చారం చేసుకుంటే విజ‌యం సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యే వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు నిరంతరం శ్ర‌మించాల‌ని అన్నారు. టిపిసిసి కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షులు భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ సేవ్ హైద‌రాబాద్ నినాదంలో కాంగ్రెస్ హైద‌రాబాద్‌లో పోరాటాలు చేయాల‌ని పిలుపునిచ్చారు. హైద‌రాబాద్ అభివృద్ది కాంగ్రెస్‌ద‌ని, హైద‌రాబాద్‌ను అన్ని ర‌కాలుగా న‌ష్టం చేసిన చ‌రిత్ర టిఆర్ ఎస్ ద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అంజ‌న్ కుమార్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు. న‌గ‌ర అధ్య‌క్షులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అంజ‌న్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ న‌గ‌రంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే ప్ర‌థ‌మ ల‌క్ష్యంగా ప‌నిచేస్తామ‌ని అంద‌రినీ క‌లుపుకుపోయి పార్టీకి పూర్వ వైభ‌వం తెస్తామ‌ని అన్నారు. కేసిఆర్ అన్ని అబ‌ద్దాలు చెబుతున్నార‌ని, కాంగ్రెస్ అన్నం వండితే కేసిఆర్ తింటున్నార‌ని ఆయ‌న అన్నారు. కార్పోరేష‌ణ్ ఎన్నిక‌లలో టిఆర్ ఎస్ ఇవిఎంల‌ను టాంపర్ చేసి విజయం సాధించింద‌ని అది అక్ర‌మ‌మ‌ని విమ‌ర్శించారు. ఇంకా స‌మావేశంలో ఎం.పి రేణుక చౌద‌రి, మాజీ కేంద్ర మంత్రి స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ, మండ‌లి విప‌క్ష ఉప‌నేత పొంగులేటి సుదాక‌ర్ రెడ్డి, మాజీ మంత్రి మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాసోజు శ్ర‌వ‌న్‌, యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షులు అనిల్ కుమార్ యాద‌వ్‌, ల‌క్ష్మ‌న్ కుమార్ గౌడ్‌, బండ కార్తీక రెడ్డి త‌దిత‌రులు ప్ర‌సంగించారు. మాజీ ఎం.పి అంజ‌న్ కుమార్ యాద‌వ్ త‌న ప‌ద‌వీ బాధ్య‌త‌ల స్వీకార కార్య‌క్ర‌మానికి ముందు న‌గ‌రంలో భారీ ప్రద‌ర్శ‌న నిర్వ‌హించారు. నాంప‌ల్లి రెడ్ రోజ్ ఫంక్ష‌న్ హాల్ నుంచి గాంధీభ‌వ‌న్ వ‌ర‌కు వేలాది మంది కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. గుర్రాలు, ఒంటెలు, పెద్ద ఎత్తున వాహ‌నాల‌లో కార్య‌క‌ర్త‌ల‌తో త‌ర‌లివ‌చ్చి ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. బానా సంచా కాల్చుతూ, కాంగ్రెస్ నినాదాల‌తో హోరెత్తిస్తూ నృత్యాలు చేస్తూ ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నారు. నాంప‌ల్లి నుంచి గాంధీభ‌వ‌న్ వ‌ర‌కు వేలాది మంది కార్య‌క‌ర్త‌ల‌తో నిర్వ‌హించిన ర్యాలీ సంద‌ర్భంగా న‌గ‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వేలాదిగా పాల్గొన్నారు.