హైదరాబాద్:
బి.సిలలో దాదాపు 113 కులాలుంటే దాదాపు వంద కులాలకు పైగా కనీస రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదని , ప్రభుత్వం ఎబిసిడిఇ వర్గీకరణ డిమాండ్‌ను అమలు చేస్తే ఇప్పటి వరకు కనీస రాజ్యధికారం నోచుకొని పేద కులాలకు న్యాయం జరుగుతుందని టిపిసిసి అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు చెప్పారు. మొత్తం 441 జడ్‌పిటిసిలలో 196 జడ్పిటిసి స్తానాలు బి.సిలకు కేటాయిస్తే 88 కులాలకు ప్రాతినిధ్యం లేదని, ఎం.పి.పిలు 434 ఉంటే బి.సిలకు 206 కేటాయించారని వాటిలో 82 బి.సి కులాలకు ప్రాతినిధ్యం లేదని అన్నారు.
ఎం.పి.టి.సిలు 6490 ఉంటే బిసిలకు 3267 కేటాయించారని అందులో 49 బి.సి కులాలకు ప్రాతినిధ్యం లేదని చెప్పారు. 8,692 సర్పంచ్ స్థానాలుంటే 4,147 బి.సిలకు కేటాయిస్తే 57 బిసి కులాలకు ప్రాతినిధ్యం లేదని, మున్సిపల్ కౌన్సిలర్లు 1453 ఉంటే బిసిలకు 898 కేటాయించారని అందులో 66 కులాలకు స్థానం లేదని, జిహెచ్ఎంసి తో సహా ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లలో 408 కార్పోరేటర్ల స్థానాలుంటే 228 బి.సిలకు కేటాయిస్తే 90 కులాలకు బి.సి కులాలకు స్థానం లేదని ఆయన వివరించారు. మున్సిపల్ చైర్మన్లు 55 మంది ఉంటే బి.సిలకు కేటాయించినవి 36 అని అందులో 99 బి.సి కులాలకు ప్రాతినిధ్యం లేదని ఆయన వివరించారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుంటే బి.సిలు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారని, 52 శాతం ఉన్న బిసిలకు 16.8 మాత్రమే ప్రాతినిధ్యం ఉందని ఎం.పీలు 17 మంది ఉంటే కేవలం 3 మాత్రమే బి.సిలున్నారని, ఎం.ఎల్.సిలు 40 మంది ఉంటే కేవలం 12 మంది మాత్రమే ఉన్నారని మొత్తంమీద బి.సిలకు రాజ్యధికారంలో సమతుల్యమైన వాటా లభిస్తలేదని సామాజిక న్యాయం జరుగుతుందని కన్న కలలు కల్లలు అవుతున్నాయని బాధ వ్యక్తం చేశారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఇంటింటి సర్వే చేసి బి.సి ఘనన పూర్తి చేసి ఆ విధంగా బి.సి వర్గీకరణకు అనుగునంగా రిజర్వేషన్లను అమలు చేయాలని, పేద కులాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఈ ప్రభుత్వం బి.సి కుల గణన చేయడానికి కేవలం పది రోజుల్లో పూర్తి చేయవచ్చునని, బి.సిలకు రాజ్యంగ పరమైన హక్కులను కాల రాయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వస్తే మా వాటా మాకొస్తదని, అన్ని పనులు పక్కన పెట్టి కనీసం అస్తిత్వం కూడా లేని సబ్బండ కులాలు ఉద్యమంలో పాలు పంచుకుంటే నేడు తెలంగాణ వచ్చాక వారికి పాలనాధికారంలో పాలు ఇవ్వకుండా గొర్రెలు, బర్రెలు, చేపలు, చాకలి బండలు, మంగలి కత్తులు ఇస్తూ ఆఖరికి రాజ్యంగ బద్దమైన హక్కులను కూడా కాలరాస్తున్నారని, తెలంగాణ వస్తే సామాజిక న్యాయం ఏర్పడుతుందని విశ్వసించిన వెనుకబడిన కులాలకు కేసిఆర్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నారని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవన్ కుమార్ విమర్శించారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికలు లోపభూయిష్టంగా ఇష్టారాజ్యంగా జరిపేందుకు మరి ముఖ్యంగా బి.సి గొంతు కోసేందుకు కేసిఆర్ సర్కార్ సమాయాత్తం అయిందని దుయ్యబట్టారు. 1999లో బి.సిల జనాభా ప్రాతిపదికన 34 శాతం వాటా కేటాయించారని, కానీ నేడు పంచాయతీ రాజ్ చట్టంలో కూడా అదే 34 శాతాన్ని కేటాయించి బి,సిలకు అన్యాయం చేస్తున్నారని, ఇదే ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిపినపుడు బి.సిలు 52 శాతం ఉన్నట్టుగా ప్రకటించి అంతేకాకుండా ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన బిల్లులో 37 శాతం బి.సిలు ఉన్నట్టు లెక్కలు చూపించిన ప్రభుత్వం , తీరా పంచాయతీ రాజ్ చట్టంలో 34 శాతానికి మాత్రమే బి.సి లను కుదించడం న్యాయమా అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పంచాయతీ ఎన్నికలు రాజ్యాధికారానికి తొలి మెట్లని, వీటిలో అన్యాయం జరిగితే పై వరకు బి.సిలకు అన్యాయం జరుగుతుందని అందువల్ల తాను ఈ విషయాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానని ఆయన వివరించారు. తాను బి.సి ఈ విషయంలో చివర వరకు పోరాడుతానని, ఇక్కడ అన్యాయం జరిగితే బి.సిలకు రాజకీయంగా నిలువెల్ల అన్యాయం జరగుతుందన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బి.సిల భాగస్వామ్యం చాల పెద్దగా ఉందని ప్రతి కులం జెఎసీలు పెట్టి ఉపాధిని పక్కన పెట్టి బజార్ల పడి కోట్లాడారని ఉద్యమంలో అనేక కులాలు ముందుకొచ్చాయని వాటన్నింటిని గుర్తించాలని ఆయన అన్నారు. అందుకోసం ఇంటింటికి తిరిగి కులాల వారీగా సర్వే చేయాలని అప్పుడే బి.సిలకు కులాలవారిగా న్యాయం జరుగుతుందని అన్నారు. బి.సిలలో అనేక కులాలున్నాయని, వారికి విద్యా, ఉపాధి రంగాలలో ఏ రకంగా 25 శాతం వాటాను వర్గీకరణ చేసి బి.సి రిజర్వేషన్లు కేటాయిస్తున్నారో అలాగే 34 శాతం పంచాయతీ రాజ్ ఎన్నికలలో కూడా ఎబిసిడీఇ వర్గీకరణ చేసి రిజర్వేషన్ల కేటాయింపులు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లీంలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు పంచాయతీ ఎన్నికలలో అమలు పరిస్తే పెద్ద ఎత్తున ముస్లీంలు కూడా రాజకీయంగా ఎదిగే అవకాశముంటుందని ఆయన వివరించారు. కేసిఆర్ 12 శాతం రిజర్వేషన్లు పేపర్ల మీద పెట్టి మోసం చేస్తే కాంగ్రెస్ మాత్రం అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలని కోరుకుంటుందని ఆయన అన్నారు.