బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం.

ప్రకాశ్, న్యూఢిల్లీ:
దేశాన్ని రక్షించాలన్న ఉద్దేశంతోనే తాను ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహాయ నిరాకరణ నుంచి జగన్‌పై దాడి వరకు వివిధ అంశాలను ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జాతీయ మీడియాకు సీఎం వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నాలుగైదు సంకీర్ణ ప్రయోగాలు జరిగాయని.. మొదట జనతా పార్టీ, ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ప్రంట్, యుపీఏ, ఎన్డీఏలు వచ్చాయని ఆయన అన్నారు. యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ 1 ప్రభుత్వాల్లో తాను కీలకపాత్ర పోషించానని చంద్రబాబు గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ రాజకీయాలు చేశామని తెలిపారు.

సంకీర్ణ ప్రభుత్వాల హయాంలోనే దేశం అభివృద్ధి చెంది అద్భుతమైన వృద్ధిరేటు సాధించిందని బాబు అన్నారు. ‘‘ఇతర పార్టీల మద్దతు లేనిదే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అలాంటిది తొలిసారి నరేంద్ర మోడీ నేతృత్వంలో పూర్తిస్థాయి మెజార్టీతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. అలాంటపుడు ప్రజలకు ప్రభుత్వం ఓ భరోసా కల్పించాలి. కానీ కేంద్రం విలువలను గాలికి వదిలేసింది. ప్రస్తుత పరిణామాలతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నా పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా. కొత్త కూటమి ఏర్పాటుకు కృషి చేస్తానని” చెప్పారు. దేశం గురించి ఆయా పార్టీలన్నీ కలవాలని భావిస్తున్నామని ఆయన అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడిందని అన్నారు. భారత్ లో రాజకీయ కంపల్షన్ ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. వైరుధ్యాలు ఉన్నప్పటికి ఆయా పార్టీలు కలిసి పనిచేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తో కూటమిలో ఉన్నామని అన్నారు. రాహుల్ గాంధీతో సమావేశం తాను కొట్టివేయడం లేదని, అయితే ఎప్పుడనేది చెప్పలేనని తెలిపారు.

2014 ఎన్నికల్లో పటిష్టమైన ప్రజాస్వామ్యం కోసం బలమైన రాష్ట్రాలను తయారు చేయడం ద్వారా బలమైన కేంద్రాన్ని రూపొందిస్తామని బిజెపి చెప్పిందన్నారు. అవినీతిని అరికట్టి అచ్చేదిన్ తెస్తామని చెప్పి ఇప్పుడేం చేస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు. బిజెపి ఎన్నికలపైనే దృష్టి పెట్టి, అన్ని వ్యవస్థలను, రాజకీయపార్టీలను ధ్వంసం చేస్తోందన్నారు. కేంద్రంలోని కీలక పదవుల్లో మొత్తం గుజరాతీలే ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా సహా అనేక మంది గుజరాతీలను నియమించి తమకు నచ్చనివాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. మిగతా రాష్ట్రాలకు చెందిన అధికారుల్లో సమర్థులు లేరా? కేవలం గుజరాతీలే సమర్థంగా పనిచేస్తారా? అని బాబు నిలదీశారు. ప్రధాని, అధికార పార్టీ అధ్యక్షుడు ఒకే రాష్ట్రానికి చెందినవారు ఉండరాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు