బీర్ కి కరువు రానుంది!!


న్యూడిల్లీ.
భూతాపం పెరిగిపోతోంది. సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. ఇవన్నీ చాలా కాలంగా వింటున్న మాటలే. కానీ గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఇష్టపడే పానీయం బీర్ పైనా పడనుంది. భవిష్యత్తులో కోరినంత బీర్ తాగే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడే మీ ఇష్టం వచ్చినట్టు బీర్ తాగమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వేసవి తాపం తీర్చుకొనేందుకు తాగే బీర్ పై భూతాపం ఎలా ప్రభావం చూపిస్తుందని ఆశ్చర్యపోతున్నారా? నమ్మశక్యంగా లేకపోయినా ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ఏటా పెరుగుతున్న వడగాలుల తీవ్రత, కరువు బీర్ తయారీకి ప్రధానంగా కావాల్సిన బార్లీ ఉత్పత్తిని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయ పరిశోధక బృందం అంచనా ప్రకారం సుమారుగా 17%కి పైగా బార్లీ ఉత్పత్తి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో బీరు ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉందని బ్రిటన్‌లోని ఈస్ట్‌ ఆంగ్లియా వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. సగటు బీర్ ధరలు రెట్టింపు కావచ్చు. ఇప్పటికే ఐర్లాండ్ వంటి దేశాల్లో బ్రూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బీర్ల వినియోగమూ తగ్గనుంది.ప్రపంచవ్యాప్తంగా బార్లీని పలు అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఎక్కువ శాతం పశువులకు దాణాగా వాడుతున్నారు. 20% కంటే తక్కువ బార్లీని బీర్ల తయారీకి వాడుతారు. కానీ అమెరికా, బ్రెజిల్, చైనాలలో మూడింట రెండొంతుల బార్లీని సిక్స్ ప్యాక్స్, డ్రాఫ్ట్స్, కెగ్స్, క్యాన్స్, బాటిల్స్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. బొగ్గు, చమురు, గ్యాస్ వంటి వేడిని అడ్డుకొనే వాయువులను వెలువరించే ఇంధనాల వినియోగం ఇదే తీరుగా కొనసాగితే భూమిపై వాతావరణ పరిస్థితులు బార్లీ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. ఆయా దేశాల పరిస్థితులను బట్టి బార్లీ ఉత్పత్తి 3-17% వరకు పడిపోనుంది. దీనివల్ల బీరు తయారీకి వాడే బార్లీ పరిమాణం తగ్గిపోనుంది. చివరకు ఉత్పత్తి పడిపోయి, డిమాండ్‌ కారణంగా బీర్ల ధరలు ఆకాశాన్నంటుతాయని పరిశోధకులు అంటున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా బీరు వినియోగం కూడా 16% లేదా 2,900 కోట్ల లీటర్లకు పడిపోతుందని తెలిపారు. ఇది ఏటా అమెరికన్లు తాగే బీరుకు సమానం.