బెళగావి రెండో రాజధాని.

బెంగళూరు:
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉత్తర కర్ణాటకను చిన్నచూపు చూశారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి డేమేజ్ కంట్రోల్ చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు కూడా ప్రారంభం కావడంతో ఉత్తర కర్ణాటకవాసులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో పడ్డారు. అతి త్వరలో బెళగావిని రాష్ట్ర రెండో రాజధానిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో పాటుగా కొన్ని ప్రభుత్వ శాఖలను అక్కడికి తరలిస్తామని సీఎం వాగ్దానం కూడా చేశారు. చాలా కాలంగా బెళగావిని రాష్ట్ర రెండో రాజధానిగా చేయాలనే డిమాండ్ వస్తోంది.
మహారాష్ట్రకు నాగ్ పూర్, జమ్ముకశ్మీర్ కు కశ్మీర్ తరహాలో బెళగావిని రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించాలన్న జేడీఎస్-బీజేపీ సంకీర్ణ సర్కార్ ప్రతిపాదనను 2006లో కర్ణాటక అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా కుమారస్వామి ప్రభుత్వం బెళగావిని రెండో రాజధాని చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అప్పటి తన ప్రభుత్వ ప్రతిపాదనను మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు పక్కన పడేశాయని, మళ్లీ తనే దీనికి కార్యాచరణ ప్రణాళిక తయారుచేస్తానని కుమారస్వామి ప్రకటించారు. ముందుగా బెళగావిలో ఉన్న సచివాలయ భవనానికి కొన్ని ప్రభుత్వ విభాగాలను వీలైనంత తొందరగా తరలిస్తామని తెలిపారు.