బోనాల ఏర్పాట్లలో వైఫల్యం.

హైదరాబాద్:
వర్షాలు బాగా పడతాయి.. కష్టాల్లేకుండా చూస్తా అని అమ్మవారి ‘రంగం’ భవిష్యవాణి చెప్పింది. బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఆమె ఎండగట్టింది. ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారు… ప్రజలకు ఎలాంటి కష్టాలు రానివ్వను.. సకాలంలో వర్షాలు కురవడంతో పాడిపంటలు బాగా పండుతాయని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగం చెప్పింది. సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరలో భవిష్యవాణి చెప్పింది స్వర్ణలత. భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. జాతర ఏర్పాట్లు సరిగా చేయలేదని.. భక్తులు ఇబ్బందులు పడ్డారని తెలిపింది. న్యాయం ఉన్నంత వరకు న్యాయం పక్షాన్నే ఉంటా.. వారిని రక్షిస్తానని తెలిపింది. ప్రజలందరూ తన దగ్గరకు బాధతో వస్తున్నారని తెలిపింది. ప్రజలకు మేలు చేశామని మీరందరూ అనుకుంటున్నారు కానీ, నిజానికి మీరు చెడు చేస్తున్నారని స్వర్ణలత చెప్పింది. నా బిడ్డలను నేను రక్షిస్తా.. దుష్టులను శిక్షిస్తా అంటూ చెప్పింది. నా దగ్గరకు వచ్చే భక్తులను కుల, మత బేధం లేకుండా సమానంగా ఆశీర్వదిస్తా అంటూ భవిష్యవాణి వినిపించింది. బంగారు ముక్కుపుడక, బంగారు బోనం సమర్పించామని, తమను ఆశీర్వదించకుండా శాపాలు పెడుతున్నావంటూ పూజారి, ఆలయ పెద్దలు మాతంగిని అడగగా.. దీనికి సమాధానంగా అందరినీ ఆశీర్వదిస్తానని.. ప్రజలందరూ నా బిడ్డలే.. అందరికీ నా ఆశీర్వాదాలుంటాయని తెలిపింది.