భట్టి ని కలసిన ఐఏఎస్,ఐపీఎస్ లు. కేసీఆర్ ‘రాడార్ ‘కు చిక్కని విషయాలు.

భట్టి ని కలసిన ఐఏఎస్,ఐపీఎస్ లు.
ప్రగతిభవన్ లో ‘ఆందోళన’!!
కేసీఆర్ ‘రాడార్ ‘కు చిక్కని విషయాలు.

ఎస్.కే. జకీర్.

టిఆర్ఎస్ ఓటమి తప్పదని కొందరు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ అభిప్రాయం ‘నిర్ధారణ’గా మారుతున్నట్టు తెలియవచ్చింది. పలువురు ఉన్నతాధికారులు కాంగ్రెస్ తెలంగాణ ప్రముఖులతో ‘టచ్’లో ఉండడం తాజా సంకేతం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కాంగ్రెస్ నాయకులతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం ఉన్నది. కాంగ్రెస్ కు వారు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఇది టిఆర్ఎస్ ను, కేసీఆర్ ను కలవరపరచే అంశం. 23 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్కతో రహస్యంగా సమావేశమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మీనా ఆధ్వర్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కాంగ్రెస్ నాయకులను కలుసుకోవడం సంచలన సన్నివేశం. ఐపీఎస్ సీనియర్ అధికారి కృష్ణ ప్రసాద్, ఐఏఎస్ శివకుమార్,ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు కాంగ్రెస్ నాయకులతో నిరంతరం ‘టచ్’ లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎస్.సి,ఎస్.టి.అధికారుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వివక్ష, నిర్లక్ష్య ధోరణి,అణచివేత, నచ్చని వారిని ‘లూప్ లైను’ శాఖల్లో కి విసిరేయడం వంటి అంశాలు కాంగ్రెస్ నాయకులతో సమావేశాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం ఉన్నది.కాళేశ్వరం రీ డిజైన్ తో జరుగుతున్న దోపిడీపై ఇటీవల టీజేఏసి నిర్వహించిన ఒక సమావేశానికి ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి హాజరు కావడం తీవ్ర దుమారం రేపింది. మురళి ‘ప్రతిఘటన’తీరు పలువురు ఎస్.సి,ఎస్.టి.కేంద్ర సర్వీస్ అధికారుల పట్ల కేసీఆర్, ఆయన సలహాదారులు వ్యవహరిస్తున్న వైఖరికి అద్దం పడుతున్నది.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పాలనా వ్యవహారాల్లో మెరుపులు మెరిపించిన మురళిని పురావస్తు శాఖకు బదిలీ చేసిన వైనం అప్పట్లో ప్రకంపనలు రేపింది. తమ పట్ల ‘వివక్ష ‘సాగుతున్నదంటూ ఐఏఎస్,ఐపీఎస్ లు సమావేశాలు నిర్వహించడం,ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జొషీకి వినతి పత్రం సమర్పించడం వంటి పరిణామాలు మీడియాలో ప్రముఖంగా రాకుండా ‘కేసీఆర్ కోటరీ’ నియంత్రించినట్టు స్వయంగా కొందరు ఐఏఎస్ అధికారులు అంటున్నారు. అయినా ఈ వార్తలు దావానలం వలె అధికారయంత్రాంగంలో వ్యాపించినవి.ప్రభుత్వానికి ‘సూపర్ సలహాదారు’వలె వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు ఎస్.సి, ఎస్.టి.అధికారుల బదిలీలలో కీలక పాత్ర పోషిస్తు,ఆ వర్గాలను అణచివేస్తున్న వైఖరి పట్ల ఐఏఎస్,ఐపీఎస్ లు ‘అగ్నిపర్వతం’లా ఉన్నారు. సరైన సమయం కోసం కాచుకుని ఉన్నారు.గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి ‘అవాంఛనీయ’ ధోరణులు లేవని సీనియర్ ఐఏఎస్ లు చెబుతున్నారు. అగ్ర కులాధిపత్యం అడుగడుగునా కనిపిస్తుండడం ప్రభుత్వానికి ‘మచ్చ’ తెచ్చే విధంగా ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఏనాడూ తమ గోడు వినేందుకు ఆసక్తి ప్రదర్శించలేదని,తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి?అన్నది ఎస్.సి, ఎస్.టి.ఐఏఎస్,ఐపీఎస్ ల ఆవేదన. ఒక ‘అగ్ర కుల’ ప్రతినిధులు మాత్రమే పాలనా యంత్రాంగాన్ని శాసించడం అనారోగ్యకరమైన వాతావరణానికి సూచిక అని వారంటున్నారు.

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పుంజుకున్నది. పలు నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నట్టు
కాంగ్రెస్ నాయకుల అంచనా. కాంగ్రెస్ కు అనుకూలంగా వాతావరణం మారుతున్న ట్టు అధికారులు భావిస్తుండడం ఒక పరిణామం. మునుపెన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత,సమిష్టి నిర్ణయాలు ఆ పార్టీ శ్రేణులలో ఉత్తేజం నింపుతున్నది. సీఎం కేసీఆర్ చెబుతున్న సర్వేలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం నమ్మడం లేదని ప్రతిపక్షాలు అంటున్నవి. కేసీఆర్ చెబుతున్న దానికి గ్రామ స్థాయిలో వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉందంటున్నారు.

గ్రౌండ్ లో కాంగ్రెస్ బాగా పుంజుకుంటున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అమలౌతున్న సర్కార్ పథకాలు ఏవీ అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయం ఎమ్మెల్యేల్లో ఉండటం ఆసక్తి ని కలిగిస్తుంది. బయటికి చెప్పేమాటల్లాగా టిఆర్ఎస్ పరిస్థితి అంత మెరుగ్గాలేదని, కాంగ్రెస్ ప్రకటిస్తున్న పథకాలు జనంలో బాగా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాయని రైతుబందు లాంటి స్కీం లు బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయనే ఆవేదన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో బలంగా ఉందని తెలుస్తున్నది.