భర్తపై తీవ్ర ఆరోపణలు చేసిన స్కేటింగ్ క్రీడాకారిణి రుచిక.

హైదరాబాద్‌:

జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడాకారిణి రుచిక తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేశారు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఆ విషయం అతడి ఫోన్‌లోని చాటింగ్‌ల ద్వారా బయటపడిందని పేర్కొన్నారు. విషయాన్ని అత్తమామలకు చెబితే.. ప్రస్తుత సమాజంలో అవన్నీ మామూలేనని కొట్టిపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు అలా మాట్లాడడం తను మరింత ఆవేదనకు గురి చేసిందన్నారు.


కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం మారేడుపల్లిలో తన నివాసంలో విలేకరులతో రుచిక ఈ విషయాలు వెల్లడించారు. బోయినపల్లికి చెందిన నగరల వ్యాపారి అక్షయ్ జైన్‌‌ను గతేడాది డిసెంబరులో రుచిక వివాహం చేసుకున్నారు. మూడు నెలల తర్వాత వీరి వివాహంలో చిచ్చు రేగింది. మారేడు‌పల్లికే చెందిన మరో మహిళతో అక్షయ్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నట్టు ఆయన సెల్‌ఫోన్‌లోని చాటింగ్ ద్వారా రుచిక గుర్తించారు. విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పెద్దలతో మాట్లాడి సయోధ్య కుదర్చాలనుకున్నారు. అయితే, అక్షయ్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ఈ కాలంలో ఇవన్నీ సహజమేనంటూ అక్షయ్‌ను సమర్థించారు. దీంతో గత నెల 25న రుచిక తన భర్తపై బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త చాటింగ్ వివరాలను బయటపెట్టారు. అయితే, రుచిక ఆరోపణలను అక్షయ్ ఖండించారు.