భారతీయుల డేటా చోరీపై సీబీఐ దర్యాప్తు.

న్యూఢిల్లీ:
ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాని బ్రిటన్ కు చెందిన రాజకీయ కన్సల్టింగ్ సంస్థ, ‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా’ (సీఏ) దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతుందని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రకటించారు. ఫేస్ బుక్ లో భారతీయుల వివరాలను సీఏ తస్కరించిందో లేదో తెలుసుకునేందుకు సీబీఐ విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. భారతీయుల సమాచారం చోరీపై కేంద్రం ఫేస్‌బుక్, కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు నోటీసులు జారీ చేసింది. మరోసారి డేటా చోరీ కాకుండా చర్యలు తీసుకుంటామని ఫేస్‌బుక్‌ సమాధానం ఇచ్చిందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అయితే తమ నోటీసులకు సీఏ స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. భారత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాన్ని సీఏ ఉల్లంఘించిందో? లేదో? సీబీఐ నిర్ధారిస్తుందని తెలిపారు.తాము భారతీయుల డేటా తీసుకోలేదని సీఏ చెబుతున్నప్పటికీ.. ఫేస్ బుక్ నివేదికతో వారి వివరణ సరిపోలడం లేదని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వదంతుల వ్యాప్తికి సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా ఆయా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నకిలీ వార్తలు, విద్వేషపూరిత సమాచార కట్టడికి మార్గాలు కనుగొనాలని ఆయా సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. మూకోన్మాద దాడులు, అల్లర్లు, వదంతుల్ని అరికట్టేందుకు సంస్థలు పరిష్కార మార్గాలు కనుగొనాలన్నారు.