భారత్‌కు అమెరికా తీవ్ర హెచ్చరిక

 

ఊహించినట్లే అమెరికా నుంచి భారత్‌ కి గట్టి హెచ్చరికలు వచ్చాయి. రష్యాకు చెందిన ఎస్‌ 400 మిస్సైల్స్‌ కొనుగోలు చేయొద్దని కొన్ని నెలలుగా భారత్‌పై ఒత్తిడి తెస్తోంది అమెరికా. ఎస్‌ 400 సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్స్ కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ చర్చలు జరిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈవారం భారత్‌ సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలోనే ఎస్‌ 400 క్షిపణులకు సంబంధించి కొనుగోలు ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఒకవేళ భారత్‌ గనుక క్షిపణులను కొనుగోలు చేస్తే .. అమెరికా చట్టాల ప్రకారం భారత్‌పై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. పాకిస్తాన్‌, చైనాల దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఎస్‌ 400 క్షిపణులు అవసరమని భారత రక్షణ దళాలు భావిస్తున్నాయి. దీంతో వీటి కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. పుతిన్‌ సంతకం చేయనున్న ఈ ఒప్పందం విలువ సుమారు 500 కోట్ల డాలర్లని (అంటే రూ. 36,500 కోట్లు) అధికార వర్గాలు అంటున్నాయి. ఇదే క్షిపణిని రష్యా నుంచి కొనుగోలు చేసినందుకు చైనాపై అమెరికా ఆంక్షలు విధించింది.