భారత్‌కు ‘ఎస్టీఏ’ హోదా.

న్యూఢిల్లీ:
భారత్‌కు అమెరికా తన స్నేహ హస్తాన్ని అందించింది. భారత్‌కు వ్యూహాత్మక వాణిజ్య అధికారం(ఎస్టీఏ-1) కల్పిస్తున్నట్లు అమెరికా అధికారిక ఫెడరల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో విమానయానం, రక్షణ రంగాల వంటి కీలక హైటెక్నాలజీ ఉత్పత్తులను భారత్ కు అమ్మేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా ఎస్టీఏ-1 హోదా పొందిన మూడో ఆసియా దేశం భారత్. ఇంతకు ముందు జపాన్, దక్షిణ కొరియాకు మాత్రమే ఎస్టీఏ-1 హోదా ఇచ్చింది. దక్షిణాసియాలో ఈ హోదా పొందిన మొదటి దేశం భారతే. ఎస్టీఏ-1 హోదాతో అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన రక్షణ ఉత్పత్తుల విక్రయాలపై అమెరికా మిత్రదేశాలకు అందే రాయితీలన్నీ భారత్‌కు కూడా వర్తిస్తాయి. ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంపై భారత్ హర్షం వ్యక్తం చేస్తుండగా.. చైనా, పాక్ లాంటి దేశాలు మాత్రం గుర్రుగా ఉన్నాయి.సాధారణంగా అత్యంత శక్తిమంతమైన నాలుగు బృందాల కూటమి(అణు ఇంధన సరఫరాదారుల కూటమి(ఎన్ఎస్జీ), ఆస్ట్రేలియా కూటమి(ఏజీ), వాసెనార్‌ ఒప్పందం(డబ్ల్యుఏ), క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో తప్పనిసరిగా సభ్యత్వం ఉన్న దేశాలకు మాత్రమే అమెరికా ఎస్టీఏ-1 హోదా ఇస్తోంది. అయితే వీటిలో అణు ఇంధన సరఫరాదారుల కూటమి(ఎన్ఎస్‌జీ)లో తప్ప మిగిలిన మూడింటిలో భారత్‌కు సభ్యత్వం ఉంది. అయినప్పటికీ భారత్‌కు మినహాయింపు కల్పిస్తూ అమెరికా ఈ హోదాను ఇచ్చింది. ఈ మేరకు అమెరికా తన ఫెడరల్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అయితే, భారత్‌కు ఎస్టీయే-1 హోదా రావడంతో పొరుగుదేశమైన చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఎందుకంటే ఎన్ఎస్‌జీ కూటమిలో భారత్‌ ప్రవేశానికి చైనా అడ్డుచెబుతూ వస్తోంది. దీని వల్ల భారత్‌కు సభ్యత్వం రావడం లేదు. దీంతో పాటు భారత్‌-అమెరికా రక్షణ ఒప్పందాలపై ముఖ్యంగా సాంకేతిక బదలాయింపుని చైనా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు హోదా రావడం చైనాకు గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. ఈ హోదాతో భారత్‌.. అమెరికా నుంచి రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చు. అంతే కాకుండా భారత్‌కు నాటో దేశాలతో సమాన హోదా లభించినట్లయింది. కొంత కాలంగా చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికా భారత్‌కు ఎస్టీఏ-1హోదా ఇవ్వడంతో చైనాకు పెద్ద షాకే.