భారత్‌ అమెరికా ఒత్తిడికి తట్టుకోగలదా?

న్యూఢిల్లీ:
ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా ఆపేయాలని అమెరికా తెస్తున్న ఒత్తిడికి భారత్ తలొగ్గుతోందా? భారత ప్రభుత్వ వైఖరి చూస్తే అగ్రరాజ్యం ఒత్తిళ్లు పనిచేస్తున్నట్టే కనిపిస్తోంది. ఆయిల్ కంపెనీలతో సమావేశమైన పెట్రోలియం మంత్రిత్వ శాఖ నవంబర్ నుంచి చమురు కొరతను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని.. క్రూడాయిల్ సరఫరాకు సౌదీ అరేబియా, కువైట్ వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించమని సూచించింది. నవంబర్ నాటికి ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను పెద్ద ఎత్తున తగ్గించడమో లేదా పూర్తిగా నిలిపేయడమో చేయాలని ఆయిల్ కంపెనీలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇరాన్ దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచానికి ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలన్న అమెరికా ఒత్తిడికి భారత్‌ తలొగ్గిందనడానికి ఇది సంకేతమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఐక్యరాజ్య సమితి, యూరప్‌ ఆంక్షలు విధించినపుడు భారత్ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించింది. అయితే ఈసారి ఇరాన్‌ చమురు దిగుమతులను పూర్తిగా ఆపాలన్న అమెరికా నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌ క్రూడ్ దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు. పైకి ఐక్యరాజ్య సమితి ఆంక్షలను మాత్రమే గుర్తిస్తామని గంభీరంగా చెబుతున్నా దేశంలోని రిఫైనరీలకు హెచ్చరిక లాంటి సూచన చేయడం చూస్తే భారత్ అమెరికా ఒత్తిడికి తలొగ్గేలా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా ఇరాన్ నుంచి చమురు దిగుమతుల్లో కోత విధించుకోవడం వరకైతే సాధ్యమే కానీ పూర్తిగా తెగతెంపులు చేసుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని నెలలుగా భారత్ దిగుమతులు పెరుగుతూ వస్తున్నాయి. తమ బ్యాంకింగ్‌ వ్యవస్థతో పాటు ఇతర అంతర్జాతీయ ఆర్థిక చెల్లింపు వ్యవస్థలు అందుబాటులో లేకుండా చేస్తామని అమెరికా ఇరాన్‌ను బెదిరించింది. ఇదే జరిగితే ఇతర దేశాలతో వాణిజ్యం చేయడంలో ఇరాన్‌కు ఇబ్బందులు తప్పవు. ఇరాన్‌ నుంచి పెద్దమొత్తంలో చమురు దిగుమతి చేసుకునే భారత్‌, చైనాలు ఆంక్షలు అమలులోకి వచ్చే నవంబర్‌ 4 తర్వాత యూరో కరెన్సీలో చెల్లించలేవు. ఇప్పటికే స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అన్ని రిఫైనరీ కంపెనీలకు నవంబర్‌ 3 నుంచి యూరో చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు సమాచారం అందించింది. గతంలో మాదిరిగా ఇరాన్‌ డాలర్లలో కాకుండా భారతీయ కరెన్సీ, రూపాయిలలో చెల్లింపు లేదా దీర్ఘకాలం క్రెడిట్‌కి అంగీకరిస్తే దిగుమతులు కొనసాగే అవకాశాలు ఉండవచ్చు.