భారత ఆరాధ్య ఆటగాడు ధోనీ.


న్యూఢిల్లీ:

భారతీయులు ఎక్కువగా ఇష్టపడే ఆటగాడెవరు? క్రికెట్‌ను ఓ మతంలా భావించే భారత్ లో క్రికెటరే అనే జవాబు వస్తుంది. కానీ ఆ పేరు వింటే అంతా ఆశ్చర్యపోతారు. ఇంటాబయటా క్రికెట్ దేవుడిగా కొలిచే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాదు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ .. రన్ మెషీన్ గా పేరొందిన విరాట్ కోహ్లి ఆ దరిదాపుల్లో లేడు. కెప్టెన్ కూల్ గా పేరు తెచ్చుకొన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారతీయులు అమితంగా ఇష్టపడే స్పోర్ట్స్ పర్సన్ గా నిలిచాడు. బ్యాటింగ్ లో మునుపటి పదును లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో నిర్వహించిన ఓ సర్వేలో మహీని మోస్ట్ అడ్మైర్డ్ స్పోర్ట్స్ పర్సనాలిటీగా అత్యధికులు ఎంపిక చేశారు.ప్రపంచంలో అత్యంత జనాదరణ ఉన్న వ్యక్తులపై ఇంగ్లాండ్ కి చెందిన యూగోవ్ అనే ఆన్ లైన్ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్ నుంచి ధోనీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ధోనీకి 7.7 శాతం ఓట్లతో మిగతా భారత ఆటగాళ్లెవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇంకా చెప్పాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత అంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఇష్టపడుతోంది ఎంఎస్డీనే. అన్ని ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈ విషయంలో బాగా వెనకబడ్డాడు. సచిన్ కి కేవలం 6.8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, సంపాదనలో అందరి కంటే ఎంతో ముందున్న విరాట్ కోహ్లి 4.8 శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగాడు.