భువనగిరి ఛైర్‌ పర్సన్‌పై అవిశ్వాసం.

ఇటీవల బిజెపిలో చేరిన చైర్ పర్సన్ లావణ్య.
భువనగిరి:
ఇటీవలే షాద్ నగర్ జన చైతన్య యాత్ర సభలో బిజెపిలో చేరిన భువనగిరి పురపాలక ఛైర్‌పర్సన్‌ లావణ్యపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు బుధవారం అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. తెరాస పట్టణాధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల కౌన్సిలర్లు బుధవారం పత్రాన్ని అందజేశారు. పురపాలికలో మొత్తం 30మంది కౌన్సిలర్లు ఉండగా ఇందులో 24మంది అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేశారు. వీరిలో 15మంది తెరాస కౌన్సిలర్లు కాగా.. నలుగురు కాంగ్రెస్‌, భాజపాకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, తెదేపా, సీపీఎం నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. నెలరోజుల్లోగా అవిశ్వాసంపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. 15 పనిదినాల్లో వారందరికీ నోటీసులు అందిస్తామన్నారు. ప్రజా విశ్వాసం కోల్పోయినందునే ఛైర్‌పర్సన్‌పై అన్ని పక్షాలు కలిపి అవిశ్వాసాన్ని ప్రతిపాదించినట్లు పట్టణ తెరాస అధ్యక్షుడు సుధాకర్‌ తెలిపారు.