భూమికి అతి దగ్గరగా ‘కుజుడు’


న్యూఢిల్లీ:

రోదసిలో మరో ఖగోళ అద్భుతం మంగళవారం చోటు చేసుకోనుంది. మొన్న సుదీర్ఘ సంపూర్ణ చంద్ర గ్రహణ సమయంలో బ్లడ్ మూన్ ఒక్కటే కాదు.. అదే సమయంలో కుజుడు భూమికి అత్యంత సమీపంగా.. అంటే 3.6 కోట్ల మైళ్ల దగ్గరగా వచ్చాడు. అప్పటి నుంచి రోజూ అంగారక గ్రహం దర్శనం అవుతూనే ఉంది. అయితే రేపు 15 ఏళ్ల తర్వాత అంగారక గ్రహం భూమికి అతి చేరువగా 35.8 మిలియన్ మైళ్ల (57.6 మిలియన్ కిలోమీటర్ల) దూరంలోకి రానున్నాడు. 2003 తర్వాత కుజుడు ఇంత సమీపానికి రావడం ఇదే తొలిసారి. ఈ నెల 31న భూమికి అత్యంత సమీపంలోకి వస్తున్న అంగారక గ్రహం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని వీక్షించి పరిశీలించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు సిద్ధం అయ్యారు.కుజగ్రహం అర్థరాత్రి అత్యున్నత ప్రదేశం చేరుతుంది. అంటే దక్షిణ అక్షంపై 35 డిగ్రీల పైకి వస్తుంది. అందువల్ల దాదాపుగా రాత్రంతా అంగారకుడిని చూడవచ్చు. 60,000 ఏళ్లలో ఒక్కసారి వచ్చేంత దగ్గరి దూరానికి 2003లో కుజుడు వచ్చాడు. ఇప్పుడు దానితో పోలిస్తే కాస్త దూరంగానే కనిపించనుంది. భూమికి సూర్యుడు, కుజుడు వ్యతిరేక దిశల్లో ఉంటారు. భూభ్రమణ, పరిభ్రమణాల కారణంగా పడమట సూర్యాస్తమయం కాగానే తూర్పున కుజగ్రహం కనిపిస్తుంది. సూర్యోదయ సమయానికి అంగారకుడు పడమరకు చేరతాడు. దీంతో మార్స్ మనకు వ్యతిరేక దిశలో ఉన్నాడని చెబుతారు. భూమి, కుజుడు పూర్తి వలయాకార కక్ష్యల్లో తిరిగితే రెండు గ్రహాలు అత్యంత సమీపానికి వస్తాయి. ఇలా భూమి, అంగారకుడు ఇంత దగ్గరగా ఎదురు పడటం సెప్టెంబర్ 15, 2035న జరుగుతుంది.జూలై 7 నుంచి ఆకాశంలో వెలుగుతూ కనిపించిన కుజగ్రహం సెప్టెంబర్ 7 వరకు దర్శనమిస్తుంది. ఇప్పుడు అరుణ గ్రహాన్ని చూడటం మిస్సయితే అక్టోబర్ 6, 2020 వరకు వేచి చూడాల్సిందే.