మంథనిలో తప్పని త్రిముఖ పోటీ!! బీజేపీ అభ్యర్థిగా సనత్!!

రాజ్ కుమార్, కరీంనగర్:
పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గం రాజకీయాలు ఆసక్తి కరంగా సాగుతున్నవి.సిట్టింగ్ ఎమ్మెల్యే పుట్ట మధు, కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి శ్రీధర్ బాబులకు గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ఉన్నత విద్యావంతుడు, యువ నాయకుడు, కాపు సామాజిక వర్గం నుంచి రేండ్ల సనత్ కుమార్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగే సన్నాహాలు చేస్తున్నారు.ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నా బీజేపీ నుంచి ఆయనకు సంకేతాలు అందినట్టు తెలిసింది.ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మహబూబ్ నగర్ పర్యటన సందర్భంగా ఆయనను సనత్ కుమార్ కలిశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ సీనియర్ నాయకులు పి.మురళీధరరావు, కిషన్ రెడ్డి ల ఆశీస్సులు కూడా సనత్ పొందినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.పుట్ట మధు సామాజిక వర్గానికి చెందిన రేండ్ల సనత్ కుమార్ తనకంటూ ప్రత్యేకంగా అభిమానులు, మద్దతు దారులను సంపాదించుకున్నారు. ఒక ప్రయివేటు కంపెనీ జనరల్ మేనేజర్ గా పని చేస్తున్న సనత్ ‘ మిషన్ భగీరథ’ పథకం అమలులో భాగంగా మంథని చుట్టు పక్కల ప్రాంతాల్లో వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కలిసి వచ్చే అంశం.పూర్వాశ్రమంలో ఎబివిపి, ఆరెస్సెస్ లతో విస్తృతంగా సంబంధాలు కలిగి ఉండడం బీజేపీని ఆకర్షించింది. ఉస్మానియా యూనివర్సిటీలో బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘం ఏబీవీపీ పక్షాన ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడుగా సనత్ కుమార్ పని చేశారు. ఆర్.ఎస్.ఎస్.నాయకులతో సంబంధాలు ఉండడం అనుకూల అంశంగా
పార్టీ నాయకులు చెబుతున్నారు.నిరుద్యోగ యువతకు ‘స్కిల్ డెవలప్మెంట్’ ఇస్తూ సనత్ వెన్ను తట్టి ధైర్యం చెపుతున్నారు. ఇలాంటి వ్యక్తి మంథని నియోజకవర్గంలో పోటీ చేస్తే ఇటు అధికారపార్టీ అభ్యర్థి మధు, అటు కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీధర్ బాబుతో గట్టిగా తలపడవచ్చునని మంథని నియోజకవర్గంలో ప్రచారం ఉన్నది.మరికొన్ని కంపెనీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారని నిరుద్యోగ యువకుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మంథని నియోజకవర్గంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి, యువకులు రేండ్ల సనత్ కుమార్ రావాలని కోరుకుంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని పెద్ద ఎత్తున మంథని ప్రజలు కోరుకుంటున్నారు. రేండ్ల సనత్ కుమార్ పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. రేండ్ల సనత్ కుమార్ మంథని అసెంబ్లీ నియోజక వర్గం బీజేపీ కార్యకర్తలతో ఆదివారం ఒక సమావేశం నిర్వహించారు. మంథని నియోజకవర్గాన్ని పుట్ట మధు, శ్రీధర్ బాబుల కబంధహస్తాల నుంచి విముక్తి చేయడానికి తాను క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. మంథనిలో
గుణాత్మకమార్పు కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలని సనత్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాశిపేట లింగయ్యల సహకారం,ప్రోత్సాహంతో తాను బీజేపీలో చేరానని రేండ్ల సనత్ వివరించారు.టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడిన సునీల్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి. మంత్రి కేటీఆర్ సునీల్ రెడ్డిని బుజ్జగించారని, ఆయన కన్విన్స్ అయ్యారని మరోవైపు ప్రచారం జరుగుతున్నది.