మరీ కామెడీగా రనౌటయ్యాడు!!

న్యూఢిల్లీ:
క్రికెట్‌లో పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మెన్‌ లో ఒకరు రనౌట్ కావడం మామూలే. అయితే ఇద్దరు ఆటగాళ్లు బంతి బౌండరీకి వెళ్లిపోయిందని పిచ్‌ మధ్యలో ముచ్చట్లు పెట్టుకొని రనౌట్‌ కావడం మాత్రం కచ్చితంగా చూసి ఉండరు. ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా అబూదాబిలో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో పాక్ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అజహర్‌ అలీ యమ కామెడీగా రనౌట్‌ అయ్యాడు.

64 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్న అజహర్ అలీ ఆసీస్‌ ఫాస్ట్ బౌలర్‌ పీటర్ సిడెల్‌ వేసిన 53 ఓవర్‌ మూడో బంతిని థర్డ్‌ మ్యాన్‌ దిశగా షాట్‌ కొట్టాడు. బంతి ఫీల్డర్లను వేగంగా దాటుకుంటూ పోయింది. అది చూసిన అజహర్ కచ్చితంగా బౌండరీ అనుకొని మరో బ్యాట్స్ మన్ అసద్ షపిక్ తో పిచ్ మధ్యలో నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు. బంతి కాస్తా బౌండరీ లైన్‌ సమీపంలో ఆగిపోయింది. బంతి వెంట పరుగెత్తుకెళ్లిన మిచెల్ స్టార్క్ దానిని వికెట్ కీపర్‌ టిమ్ పైనీకి విసిరాడు. బంతిని అందుకున్న పైనీ వికెట్లను గిరాటేశాడు. ఔట్ అంటూ అంపైర్లకు అప్పీల్ చేయడం ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో అజహర్‌-అసద్‌ ఒక్కసారిగా షాకయ్యారు. నిబంధనల ప్రకారం ఔట్‌ కావడంతో అజహర్‌ అలీ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. చిన్నపిల్లాడిలా అజహర్ రనౌట్‌ కావడం స్టేడియంలోని ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది.