మరో’ కౌసర్ బేగం’ కథ.

ఎస్.కె.జకీర్.
ప్రధాని నరేంద్ర మోడీ మహిళా స్వయం సహాయక సంఘాలు దేశంలో పురోగతి సాధించాయని ప్రతి సభలో తనదైన శైలిలో చెబుతారు. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలతో రైతుల ఆదాయం రెట్టింపైందని చాటింపు వేస్తుంటారు. కానీ ఇందులో నిజమెంత? నిజంగానే దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపైందా? ఎన్డీఏ ప్రభుత్వ విధానాలతో వ్యవసాయం పండుగగా మారిందా? ఇదే విషయంపై ఓ హిందీ న్యూస్ ఛానెల్ పరిశోధన జరిపింది. మోడీ చెబుతున్నదంతా సొంతడబ్బా అని తేల్చేసింది. తాజాగా ఆయన ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల మహిళలు, కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అందులో కూడా అదే విషయాన్ని చెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన కౌసర్‌ షాహీన్‌ బేగం తన ఆర్థిక స్థితి కొంత మెరుగుపడిందని చెప్పటంతో ప్రధాని తెగ సంబరపడిపోయారు. అదే ఒరవడి కొనసాగిస్తూ ప్రధాని తన పేరుతో ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ మొబైల్ యాప్ నుంచి జూన్ 20న 5 కోట్ల రైతులతో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. అందులో ఛత్తీస్ గఢ్ కంకేర్ జిల్లాకు చెందిన చంద్రామణి కౌశిక్ అనే ఓ మహిళా రైతుతో ప్రధాని మాట్లాడారు. సుమారుగా మూడు నిమిషాలపాటు చంద్రామణి, ఆమెతో ఉన్న మహిళా స్వయం సహాయక గ్రూపుతో మోడీ సంభాషించారు. చుట్టూ 17 మంది మహిళా సభ్యులతో కూర్చున్న చంద్రామణి ముందుగా ప్రధానికి తనను తాను పరిచయం చేసుకుంది. గతంలో తన రెండెకరాల పొలంలో కష్టపడి పనిచేస్తే రూ.15,000-20,000 వచ్చేవని చెప్పింది. (ఏడాదికా లేదా నెలకా అనేది చెప్పలేదు) అది తన కుటుంబానికి సరిపోక పోవడంతో తను సీతాఫలాల సాగు ప్రారంభించానని..దాంతో కిలో రూ.50 చొప్పున ఇప్పుడు రూ.700 వస్తున్నాయని తెలిపింది. దీంతో ఆనందపడ్డ ప్రధాని, మీ ఆదాయం రెట్టింపైందా? అని అడిగితే ఆమె అవునని జవాబిచ్చింది.
వ్యవసాయంతో చంద్రామణి ఆదాయం నిజంగా రెట్టింపైందా అని తెలుసుకొనేందుకు ఓ హిందీ వార్తా ఛానెల్ ఆమె ఉండే కంకేర్ గ్రామానికి వెళ్లింది. చంద్రామణి, ఆమెతో కలిసి సీతాఫలాలు అమ్మే ఇతర మహిళా బృంద సభ్యులతో మాట్లాడింది. తమకు అలా చెప్పమని అధికారులు శిక్షణ ఇచ్చారని వాళ్లు చెప్పారు. వరి సాగుతో తన ఆదాయం రెట్టింపు కాలేదని చంద్రామణి చెప్పింది. స్వయంగా రైతు అయిన ఆ గ్రామ సర్పంచ్ ది కూడా అదే మాట. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యవసాయశాఖ అధికారులు ప్రధానితో మాట్లాడవచ్చని చెప్పి ఏం చెప్పాలో తమందరికీ శిక్షణ ఇచ్చారని చంద్రామణి, ఇతర మహిళలు తెలిపారు. వ్యవసాయం ద్వారా ఆదాయం రెట్టింపు కావడం కలలోని మాటని చెప్పారు. కొన్నిసార్లు సొంతడబ్బు పెట్టుకోవాల్సి వస్తోందని వాపోయారు.జూలై 6న ఈ వార్త బయటికి పొక్కడంతో పెద్ద వివాదం చెలరేగింది. జూలై 9న ప్రభుత్వ వర్గాలు మరోసారి చంద్రామణి ఇంటికి వెళ్లి మాట మార్పించేందుకు ప్రయత్నించాయి. వరి సాగుతో ఆదాయం పెరిగిందని చెప్పడం లేదని.. సీతాఫలాల సాగుతో ఆమె ఆదాయం రెట్టింపైందని వివరించారు. వరితో పాటు అదనంగా సీతాఫలాలు సాగు చేసినందువల్ల చంద్రామణికి రాబడి పెరిగిందని తెలిపారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కూడా హుటాహుటిన దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. చివరిగా తేలింది ఏమంటే…. చంద్రామణికి సీతాఫల్ పంటతో రోజువారీ ఆదాయం రూ.50-60 పెరిగిన మాట నిజమే. రూ.700 లాభం వస్తున్న మాటా నిజమే. కానీ ఆ వచ్చిన రూ.700 గ్రూపులోని 12మంది పంచుకోగా ఒక్కొక్కరి వాటాకి వచ్చేది రూ.58 మాత్రమే.