మల్టీప్లెక్స్ లపై మహారాష్ట్ర యూ-టర్న్.

ముంబయి:
ఆగస్ట్ 1 నుంచి మల్టీప్లెక్సుల్లోకి బయటి ఆహారాన్ని తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ మహారాష్ట్ర శాసనసభలో మంత్రి రవీంద్ర చౌహాన్ ప్రకటించి 24 రోజులే. ఇంతలోనే మహారాష్ట్ర సర్కార్ యూ-టర్న్ తీసుకుంది. మల్టీప్లెక్సుల్లోకి బయటి ఆహారాన్ని అనుమతిస్తే భద్రత ప్రమాదంలో పడుతుందని బాంబే హైకోర్ట్ కి చెప్పింది. ఈ వ్యవహారంలో తనకు జోక్యం చేసుకొనే ఉద్దేశమే లేదని స్పష్టం చేసింది. అయితే మల్టీప్లెక్సులు, సినిమా హాళ్లలో మంచినీరు ఉచితంగా అందించాలని.. ఆహారపదార్థాలు, ఇతర పానీయాలను ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని ఆదేశాలు జారీ చేయనున్నట్టు మంగళవారం హైకోర్ట్ లో దాఖలు చేసిన అఫిడవిట్ లో తెలిపింది. మహారాష్ట్ర సినిమా (రెగ్యులేషన్స్) రూల్స్, 1966లో ప్రేక్షకులను బయటి వస్తువులు తెచ్చుకోకుండా అడ్డుకొనే నియమమేదీ లేదని ఆ అఫిడవిట్ లో పేర్కొంది. కానీ బయటి ఆహారపదార్థాలను అనుమతిస్తే గందరగోళ వాతావరణం ఏర్పడుతుందని, భద్రత ప్రమాదంలో పడుతుందని డీజీపీ అభిప్రాయ పడినట్లు చెప్పింది.