మసకబారుతున్న ‘అరుణ’కాంతులు

దేశ రాజకీయ యవనికపై కమ్యూనిస్టు పార్టీలది ఒక ప్రత్యేక స్థానం. దేశ సంస్కృతిలో కమ్యూనిజం అంతర్భాగైమెందని చెప్పవచ్చు. కొన్ని దశాబ్దాల క్రితం కమ్యూనిస్టు పార్టీల పేరు వింటేనే నరాలు ఉప్పొంగేవి. కార్మికులు, కర్షకులు, శ్రామికులు బడుగు జీవుల గుండెల్లో చెరగని ముద్రవేసిన కమ్యూనిస్టు పార్టీలు నేడు ఏ స్థితిలో వున్నాయి? మహోన్నత వ్యక్తిత్వంతో ఆయా పార్టీలకే వన్నెతెచ్చిన నాయకుల స్ఫూర్తి ఎందుకూ కొరగాకుండా పోయిందా? సైద్ధాంతిక నిబద్ధతకు తిలోదకాలు వదలి అవకాశవాద రాజకీయాలు వామపక్ష పార్టీలలో సైతం ప్రవేశించిన లక్షణాలు ద్యోతకమవుతుండడం ఆయా పార్టీల అభిమానులను కలచివేస్తుంది. కమ్యూనిస్టు పార్టీలు అంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యపై పోరాడే ప్రజాసంఘాలే అన్న భావన నేటి తరంలో కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే వారిలో దార్శనికత లోపించి, తాత్కాలిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారన్న భావన కలుగుతుంది. రాజ్యాధికార సాధన ద్వారానే తాము నమ్మిన సిద్ధాంతానికి న్యాయం చేయవచ్చన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నట్టున్నది. దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు పశ్చిమబెంగాల్‌లోనూ, మరో రెండున్నర దశాబ్దాలపాటు త్రిపురలోనూ అప్రతిహతంగా కొనసాగిన కమ్యూనిస్టుల హవా ఎందుకు మసకబారింది? అంతర్గత కలహాలు, హింసాకాండలు వంటి అపశ్రుతులు అప్పుడప్పుడు చోటుచేసుకున్నప్పటికీ జనరంజక పాలన అందించని పక్షంలో ప్రజల మన్ననలు పొంది, సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగటం సాధ్యం కాదు. దీనినిబట్టి పశ్చిమబెంగాల్, త్రిపుర వంటి చోట్ల కమ్యూనిస్టుల పాలనకు ప్రజామోదం లభించినట్టుగానే భావించవచ్చు. ప్రస్తుతం ఒక్క కేరళలో మాత్రమే కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వమున్నది. ప్రధానంగా పశ్చిమబెంగాల్, త్రిపురలలో కమ్యూనిస్టు కోటలు కూలిపోవటానికి కారణాలు విశ్లేషించి, ఆత్మపరిశీలన చేసుకుంటే కొంతమేైరెనా పునఃప్రాభవాన్ని ప్రోదిచేసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలు కమ్యూనిస్టులకు కంచుకోటలుగా వుండేవి. ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో కమ్యూనిస్టు పార్టీలకు వున్న ఓటుబ్యాంకు చెల్లాచెదురయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కమ్యూనిస్టుల ప్రాభవం మసకబారనారంభించింది. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీయే సరైన ప్రత్యామ్నాయంగా భావించి, ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీలు సైతం తెలుగుదేశం పంచన చేరాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారాక రామారావు కమ్యూనిస్టులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వటంతో కేడర్‌లో సైతం ఉత్సాహం వెల్లివిరిసింది. తదనంతరం రాష్ట్ర రాజకీయాలలో కమ్యూనిస్టులు ఎంతో సంకటస్థితిని ఎదుర్కొన్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలలో ఉత్తేజం నింపాలంటే ఒక మంచి పోరాట అంశం లేదా తిరుగులేని నాయకుైడెనా వుండాలి. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలలో ఆ రెండూ లోపించాయనే చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల పట్ల వ్యతిరేకత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపిలతో వున్న వైరుధ్యాలు కమ్యూనిస్టులను ఒంటరి చేశాయి. ఆ సమయంలోనే ‘జనసేన’ రూపంలో కమ్యూనిస్టులకు ఒక ఆశాకిరణం కనిపించింది. జనబాహుళ్యంలో విశేష ప్రజాదరణ గల సినీ హీరో పవన్‌కల్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీని కమ్యూనిస్టు పార్టీలు భుజాన వేసుకున్నాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర వున్న కమ్యూనిస్టు పార్టీలు, అప్పుడే పురుడుపోసుకున్న ఒక చిరు ప్రాంతీయ పార్టీతో జతకట్టాల్సి రావటం రాజకీయ వైచిత్రి కాక మరేమిటి? తెలంగాణలో తమ్మినేని వంటి అగ్రశ్రేణి నాయకుడు సైతం ముందుగా తమైవెపు నుంచే ‘జనసేన’తో జట్టుకట్టేందుకు సిద్ధమని ప్రకటించడం ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న బేలతనాన్ని బహిర్గతం చేస్తున్నది. జనసేనతో జట్టుకట్టడంలో తప్పుబట్టాల్సిందేమీ లేదు. అయితే ఎన్నికలలో పోటీపై ఇంకా స్పష్టత సైతం ఇవ్వని ఒక ప్రాంతీయ పార్టీతో కలిసేందుకు సిద్ధమని తమ్మినేని వంటి సీనియర్ నాయకుడు సంకేతాలు ఇవ్వటం విస్మయం కలిగిస్తున్నది. బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు కాంగ్రెస్‌తో సైతం జట్టుకట్టేందుకు వెనుకాడని కమ్యూనిస్టులు, కొన్ని సందర్భాలలో ఇతర ప్రాంతీయ పార్టీలతో మహాకూటమిలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ రాజకీయ వ్యూహాలలో ఒక భాగమే కావచ్చు. అయితే కమ్యూనిస్టు పార్టీలు జీవితకాలం ఏదో ఒక పార్టీకి కొమ్ముకాయటం లేదా మరొక పార్టీని అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు ఒక సాధనంగా వుండాల్సిం దేనా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీటవేస్తూ సుదీర్ఘ రాజకీయ ప్రస్తానానికి అవసరైమెన వ్యూహరచనపై దృష్టి సారించకపోవటం ఒక లోపవేునని చెప్పవచ్చు. గతంలో విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కర్షకులు… ఇలా ప్రతిరంగంలోనూ కమ్యూనిస్టు పార్టీలకు బలైమెన విభాగాలుండేవి. ఇప్పుడు ఆ విభాగాల గురించి పట్టించుకునే వారే లేరు. ప్రతి ఏటా కొత్తగా చేరే ఓటర్లకు కమ్యూనిస్టు పార్టీల గురించి కనీస అవగాహన కల్పించే ప్రయత్నాలు జరగటంలేదన్నది వాస్తవం. అత్యధికంగా 2.5 శాతం, కేరళ 1.4 శాతంగా కమ్యూనిస్టు పార్టీ సభ్యుల పెరుగుదల వుంటే ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 0.0914 శాతంగా మాత్రమే వుండటం గమనార్హం. పెద్ద రాష్ట్రాైలెన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ప్రతి ఏటా కమ్యూనిస్టు పార్టీలో సభ్యుల పెరుగుదల దాదాపు వేళ్ళమీద లెక్కబెట్టగలిగినంత మందే అని చెప్పవచ్చు. ఈ గణాంకాలను గమనంలోకి తీసుకోకుండా, దృష్టి సారించకుండా కేవలం రాజకీయ అవసరాలైవెపే మొగ్గుచూపితే అది ఆత్మహత్యాసదృశ్యం కాకమానదు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి ఆలంబనగా నిలిచే విద్యార్థులు, యువజనులలో కమ్యూనిస్టు భావజాలాన్ని నింపేవారే లేకపోవటం పెద్ద లోటు అని అంగీకరించక తప్పదు. ఈ లోపాలను సరిదిద్దకుండా, కేవలం ఏదో ఒక రాజకీయ పార్టీ పంచన చేరి, మరో పార్టీని అధికారంలోకి రాకుండా నిలువరించే ఉపకరణాలుగా మిగులుతారా?… ఓర్పు, సహనంతో సైద్ధాంతికతకు కట్టుబడి విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, మహిళలలో విశ్వాసాన్ని ప్రోదిచేసి పునఃప్రాభవం కోసం బాటలు వేసుకుంటారా?.. అనేది నేటి నేతల చేతుల్లోనే వున్నది. వారి పయనమెటో వేచి చూడాల్సిందే.