మహా కాళేశ్వరం

అక్కడ మహాయజ్ఞం జరుగుతోంది. రాత్రి, పగలూ తేడా లేదు. ఇంజనీర్‌, కార్మికుడు వ్యత్యాసం లేదు. ప్రాజెక్టు.. కాంట్రాక్టర్‌.. అధికారులు.. వర్కర్ల బంధం లేదు. ప్రాజెక్టు పూర్తిచేయాలి.. నీళ్ళివ్వాలి.. ఎంత కాంక్రీట్‌ వేశాం.. ఎన్ని బస్తాల సిమెంట్‌ వాడాం.. సవాల్‌ ఏదైనా చేద్దాం.. చేసేద్దాం.. అంతా ఒకే మంత్రం. ఏ బ్యారేజీ దగ్గర చూసినా.. పంప్‌హౌజ్‌ దగ్గర చూసినా.. సర్జ్‌పూల్‌ దగ్గర చూసినా.. రిజర్వాయర్ల దగ్గర చూసినా.. ఉరిమే ఉత్సాహం. ఈ ఖరీఫ్‌కు నీళ్ళివ్వాలి. లక్ష్యం ఎంతున్నా.. పనివేళలు, పడికట్టు సంప్రదాయాలు అన్నీ పక్కనపెట్టి ప్రతిరోజూ 40వేల మంది కార్మికులు అహోరాత్రులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. పనుల వేగంతో ప్రతిరోజూ ప్రాజెక్టు రూపుమారిపోతోంది. ఔరా అంటూ పనులవేగానికి ఇంజనీరింగ్‌ ప్రపంచమే నివ్వెరపోతున్నది. అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతున్నది. ఇంజనీర్లు, కార్మికులు, ఏజెన్సీలలో ప్రభుత్వం నింపిన ఆత్మవిశ్వాసం.. కొత్తరాష్ట్రంలో నీటికరువు తరమాలన్న కార్యాచరణ యజ్ఞం అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అబ్బురపరుస్తున్నది. ఆసియాలోనే అనేక ప్రత్యేకతలున్న మహా ప్రాజెక్టుగా ప్రశంసలందుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనుల తీరును ఆంధ్రప్రభ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

భూగర్భంలో జలప్రపంచం.. మానవ మహాద్భుత నిర్మాణం.. నూటయాభైమీటర్ల లోతు మూడువందల డెబ్బయ్‌ ఐదుమీటర్ల పొడవు, అరవై ఏడుమీటర్ల ఎత్తు, ఇరవై ఐదుమీటర్ల వెడల్పు అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ సర్జ్‌పూల్‌.. ప్రపంచంలోనే అరుదైన నిర్మాణం భూగర్భంలో జలాద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు. మనిషి ఊహకందని నిర్మాణం. నిర్మాణం పూర్తికాకముందే దేశమంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశంలో నవచరిత్ర లిఖించేందుకు సన్నద్దమైన ప్రాజెక్టు. తెలంగాణ ప్రజల కలల పంట.. బీళ్ళల్లో పచ్చనిసిరులు చూస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేధోమధన దీక్షాదక్షతల ప్రతిరూపం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిభాషలో చెప్పాలంటే చెప్పుకుంటే రామాయణమంత.. వింటే భారతమంత.. చూస్తే బాహుబలి అంత. ఇక దేశంలోని సుప్రసిద్ద ఇంజనీర్ల మాటల్లో చెప్పాలంటే కాళేశ్వరం నభూతో నభవిష్యత్‌. వేలపుస్తకాలు చదివినా దొరకని అద్భుతాల అనుభవం.. ఇంజనీరింగ్‌ మహాద్భుతం. ఇక సూటిగా చెప్పుకుంటే డిజైన్‌ నుండి అనుమతుల దాకా కాళేశ్వరం ప్రాజెక్టుది.. అన్నింటా ప్రత్యేక చరిత్రే. ఆరంభంలోనే కాదు.. అనుమతుల విషయంలోనూ.. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులు సృష్టిస్టోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళు అవుతున్న సందర్భంగా రూ.80,499కోట్ల వ్యయంతో 37లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించే మహా ప్రాజెక్టుపై ప్రత్యేక కథనం.
దేశంలోని భారీ ప్రాజెక్టులు ఎక్కువ భాగం.. అంతర్రాష్ట్ర అనుమతులు లేకుండా, కేంద్ర శాఖల అనుమతులు లేకుండా.. ప్రారంభించినవే కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు ఇందుకు భిన్నం. ఆసియాలోనే అనేక ప్రత్యేకతల సమాహారంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కరువునేలలో కాంతులు తీసుకురానుంది. విషాదం నిండిన భూముల్లో వికాసం నింపనుంది. ప్రాజెక్టుపై చర్చ జరుగుతుండగానే వాటి ఫలాలు అందించనుంది. లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టు రెండేళ్ళలోనే అనుమతులు సహా పూర్తిచేసుకున్న సందర్భం భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమం. తెలంగాణ కీర్తికిరీటంలో కాళేశ్వరం కలికితురాయిగా మిగిలిపోనుంది.

కాళేశ్వరం ముఖ్యాంశాలు
ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.80,499కోట్లు
మొత్తం పొడవు: 1,832కిమీ
గ్రావిటీ కెనాల్‌ : 1531కిమీ
టన్నెల్‌ పొడవు: 203కిమీ
ప్రెషర్‌ పైప్‌లైన్‌: 98కిమీ
మొత్తం లిఫ్ట్‌లు: 20
పంప్‌హౌజ్‌లు : 19
మొత్తం పంపులు: 88
విద్యుత్‌ అవసరం:4,627.24మెగావాట్లు
రిజర్వాయర్లు : 20
పాత రిజర్వాయర్లు: 5
లైవ్‌స్టోరేజీ : 147.71టిఎంసి

ఫలితం దిశగా
కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను అందించేదిశగా ముందుకు వెళుతోంది. తెలంగాణలోని 60శాతం భూభాగానికి సాగునీరందించే ఈ ప్రాజెక్టు పనులు వాయువేగంతో సాగుతున్నాయి. మూడుషిఫ్ట్‌లలో 40వేల మంది కార్మికులు నిర్విరామంగా ప్రాజెక్టు నిర్మాణపనుల్లో పనిచేస్తుండగా, జూలైలోనే తొలి ఫలితం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిర్మాణపనులు, కాల్వలు, మోటార్లు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, లైన్లు.. అన్నింటినీ ప్రభుత్వం ఏకకాలంలో సమన్వయం చేస్తూ పర్యవేక్షిస్తూ యజ్ఞాన్ని నిర్వహిస్తోంది. జూలై లోనే మేడిగడ్డ నుండి పంపింగ్‌ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అద్భుత వ్యూహ ప్రణాళిక, దిశానిర్దేశం, నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు కార్యాచరణ కలసిరావడంతో.. కాళేశ్వరం వడివడిగా ముందుకు సాగుతోంది. భారతదేశంలోనే అత్యంత వేగంగా అనుమతులు పొందడమే కాక నిర్మాణం పూర్తిచేసుకున్న భారీ ప్రాజెక్టుగా కాళేశ్వరం రికార్డు పుటలకెక్కుతుంది. మొత్తం 19పంపింగ్‌ స్టేషన్లను జూలై నుండే ప్రారంభించాలని ప్రభుత్వం తలపోస్తోంది. తొలిదశలో శ్రీరాంసాగర్‌ ఆయకట్టును స్థిరీకరించనున్న ప్రభుత్వం డిసెంబర్‌ నాటికి సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి జిల్లాలకు సాగునీరు అందించనుంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు ఫిబ్రవరి 2019కు సాగునీరందించాలన్న ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తోంది.

సజీవంగా గోదావరి..
సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ, తుపాకులగూడెం వరుస బ్యారేజీలను గోదావరి నదిపై నిర్మిస్తున్నందున గోదావరి నది సజీవంగా మారనుంది. గోదావరి నదిలో 150కిమీ. మేరకు నదిలో 365రోజులు నీరు నిలిచి ఉంటుంది. దీనివల్ల అంతర్గత జలరవాణా అభివృద్ది చేసుకోవచ్చు. ఈ జలాశయాల్లో చేపలపెంపకం ద్వారా మత్స్యపరిశ్రమ, పర్యాటకాన్ని అభివృద్ది చేయడం ద్వారా ప్రజలకు
ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
కాళేశ్వరంలో భాగంగా నిర్మించే బ్యారేజీలు, రిజర్వాయర్ల నీటినిల్వ సామర్ధ్యం

‘’’రిజర్వాయర్‌ సామర్ధ్యం (టిఎంసిలలో)
మేడిగడ్డ 19.73
అన్నారం 6.22
సుందిళ్ళ 2.16
మేడారం ట్యాంక్‌ 0.78
మల్కపేట 3.0
అనంతగిరి 3.5
రంగనాయకసాగర్‌ 3.0
మల్లన్నసాగర్‌ 50
కొండపోచమ్మ సాగర్‌ 7.0
బస్వాపూర్‌ రిజర్వాయర్‌ 11.39
గంధమల్ల 9.87
చేవెళ్ళ రిజర్వాయర్‌ 3
తిప్పారం రిజర్వాయర్‌ 1
కొండం చెరువు 5
మోతె రిజర్వాయర్‌ 2.9
గుజ్జుల రిజర్వాయర్‌ 1.5
కటేవాడి 5.0
తలమడ్ల 5.0
తిమ్మక్కపల్లి 3.0
కచ్‌పూర్‌ 2.5
ఈసాయిపేట 2.5

బాహుబలి మోటార్లు
కాళేశ్వరం ప్రాజెక్టులో సాంకేతికత అబ్బురపరుస్తోంది. ఒకటిన్నర కిలోమీటర్ల సొరంగం తర్వాత సుమారు 22అంతస్తుల భవంతిని (60మీటర్ల ఎత్తు) తలదన్నేలా అపూర్వ భూగృహం నిర్మించి, అందులో ప్రపంచంలోనే అత్యధిక సామర్ధ్యం గల మోటార్లు, పంపులు, అతిపెద్ద జలాశయం, రిమోట్‌తో పనిచేసే మహాయంత్రభూతాలు ఏర్పాటుచేస్తే అది అద్భుతం కాక మరేమవుతుంది. ఇలాంటి అద్భుతాన్ని చూసేందుకు ఇపుడు యావత్‌ తెలంగాణ కాళేశ్వరం యాత్రాస్థలికి క్యూ కట్టింది. నూట ముప్పయ్‌తొమ్మిది మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మోటార్లు ఒక్కొక్కటి మూడువేల క్యూసెక్కుల చొప్పున ఆరుమోటార్లతో రోజుకు రెండు టిఎంసిల నీటిని పంపింగ్‌ చేసే మహాజలసాధన వ్యవస్థ కాళేశ్వరం. లక్ష్మీపూర్‌ ప్యాకేజీ-8లో భాగంగా నిర్మించిన సొరంగం, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన సర్జ్‌పూల్‌ మహాద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. మేడారం ప్రాజెక్టు నుండి ప్యాకేజీ-8కు నీటిని చేర్చే ఈ టన్నెల్‌ను 15కిమీ పొడవున నిర్మిస్తున్నారు. టన్నెల్‌, సర్జ్‌పూల్‌ నిర్మాణం ప్రపంచమే అబ్బురపడేలా ఉంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన టన్నెల్‌ దేశంలోనే ఎక్కడా లేదని ఇంజనీర్లు చెబుతున్నారు. స్విట్జర్లాండ్‌, ఇంగ్లాండ్‌ దేశాలలో పెద్ద టన్నెల్స్‌ ఉన్నాయని.. లక్ష్మీపూర్‌ టన్నెల్‌ ఆసియాలోనే అతిపెద్దదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక్కడ 1,87,000హార్స్‌పవర్‌ (139మెగావాట్లు) ఉన్న అతి భారీమోటార్లు వాడుతుండడం విశేషం. 7భారీ మోటార్లు ఈ సర్జ్‌పూల్‌లో అమరుస్తుండగా.. లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌ నుండి నీరు ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌లోకి.. అక్కడి నుండి మిడ్‌మానేరులోకి వెళ్ళనుంది. ఇంత భారీ సామర్ధ్యమున్న బాహుబలి మోటార్లు భారతదేశంలోనే ఒక సాగునీటి ప్రాజెక్టులో నిర్మించడం ఇదే ప్రధమం. ఈ సర్జ్‌పూల్‌ పనులు పూర్తయ్యాయి. ఏకకాలంలో ఇన్ని బరాజ్‌లు, పంప్‌హౌజ్‌లు, టన్నెళ్ళు, కాల్వలు, ఇంతపెద్ద లిఫ్టింగ్‌ వ్యవస్థను నిర్మించిన చరిత్ర దేశంలో మరే రాష్ట్రానికి లేదు. దేశం సృష్టించుకున్న అద్భుతాల్లో కాళేశ్వరం ఒకటిగా మిగలనుంది.

వేగానికి రూపం ఉంటే..
కాళెశ్వరం ప్రాజెక్టు పనులు ఎన్నడూలేనంత వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే టన్నెల్‌ నిర్మాణ పనులు పూర్తికాగా..
తొలిదశలో మిడ్‌మానేరు వరకు నీరందించాలన్న వ్యూహంతో ప్రభుత్వం పనులను పరుగెత్తిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టు పనులు పరుగెడుతున్నాయి. ఈ ఏడాది జూలై నుండి పంప్‌హౌజ్‌ల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే ప్రణాళికతో ఉంది. పనుల్లో పెరిగిన వేగం ఫలితంగా జూలై ఆరంభంలోనే రైతులకు కాళేశ్వరం తొలి ఫలం దక్కే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు అంచనావేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత-చేవెళ్ళ పేరుతో ప్రాజెక్టు చేపట్టగా, తుమ్మిడిహట్టివద్ద 160టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించారు. బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడంతో.. పనులు ముందుకు కదల్లేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందుకు అనుగుణంగా ప్రాజెక్టులన్నింటినీ సమీక్షించుకుని.. పొరుగు రాష్ట్రాలతో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా
సంప్రదింపులు జరిపి మెరుగైన వినియోగం కోసం రీడిజైన్‌ చేపట్టింది. మహారాష్ట్రను ప్రాజెక్టు కోసం సానుకూలంగా ఒప్పించడం చారిత్రకం కాగా, రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించారు. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద ఒక బ్యారేజీ, అన్నారం వద్ద ఒక బ్యారేజీ, సుందిళ్ల వద్ద మరో బ్యారేజీ, వాటి ఎగువభాగాన పంప్‌హౌజ్‌లు నిర్మించి రోజుకు 2టిఎంసిల చొప్పున నీటిని ఎత్తిపోయాలని డిపిఆర్‌ రూపొందించారు. రూ.1245కోట్ల అంచనా వ్యయంతో 8.83టిఎంసిల సామర్ధ్యంతో సుందిళ్ళబ్యారేజీని చేపట్టారు. 1.3కిమీ పొడవు ఉండే ఈ బ్యారేజీకి 74గేట్లు అమరుస్తున్నారు. రోజుకు 3500క్యూబిక్‌మీ. కాంక్రీట్‌ పనులు నడుస్తున్నాయి. 2018 డిసెంబర్‌ నాటికి ఈ బ్యారేజీని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి ఎగువన అన్నారం బ్యారేజీకి దిగువన పంప్‌హౌజ్‌ నిర్మిస్తున్నారు. 37మీ.లోతు, 245మీటర్ల వెడల్పు, 3500మీ పొడవుతో పంప్‌హౌజ్‌ నిర్మిస్తున్నారు. ఈ పంప్‌హౌజ్‌ల నుండి 5పైప్‌లైన్ల ద్వారా 2టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు 8మోటార్లు ఏర్పాటుచేయనున్నారు. పైపులు అమర్చేవరకు కాంక్రీట్‌ పనులు సాగుతున్నాయి. మేడిగడ్డ పనులు రికార్డులు హోరెత్తిస్తున్నాయి. రోజుకు 7వేల క్యూబిక్‌మీటర్లకు పైగా కాంక్రీట్‌ పనులు ఇక్కడ జరుగుతున్నాయి.

ఇదీ ప్రస్థానం
.మేడిగడ్డ నుండి మొదలయ్యే కాళేశ్వరం ప్రస్థానం ఇలా సాగనుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద నిల్వ ఉండే దాదాపు 20టిఎంసిల నీటి నుంచి అన్నారం వద్ద 6.22 టీఎంసీల బ్యారేజీకి లిప్టు చేస్తారు. అన్నారం నుంచి సుందిల్లలో 2.16 టీఎంసీల బ్యారేజీలోకి పంపింగ్‌ చేస్తారు. సుందిల్ల నుంచి 25 టీఎంసీల ఎల్లంపల్లికి ప్రాజెక్టుకు అక్కడి నుంచి 25 టీఎంసీల మిడ్‌ మానేరు నీటిని తరలిస్తారు. ఈ నీటిని స్థానిక అవసరాలకు వినియోగించుకుంట పత్తిపాకలో నిర్మాణం చేపట్టే 5.50టీఎంసీల రిజర్వాయర్‌కు,
మలక్‌పేట్‌లోని 3 టీఎంసీల రిజర్వాయర్‌కు, అనంతగిరిలో నిర్మాణం తలపెట్టిన 3.50 టీఎంసీల రిజర్వాయర్‌కు, ఇమామాబాద్‌కు 2.50 టీఎంసీలను, మల్లన్నసాగర్‌కు 50 టీఎంసీలను, కొండ పోచమ్మ
రిజర్వాయర్‌కు 21 టీఎంపీలు, బస్వాపూర్‌కు 14.16 టీఎంసీలు,
గందమల్లకు 9.87 టీఎంసీలు, మోతెకు 2.90 టీఎంసీలు, గుజ్జులకు 1.50 టీఎంసీలు, కాటేవాడికి 5 టీఎంసీలు, తడమడ్లకు 5 టీఎంసీలు, తిమ్మక్కపల్లికి 3 టీఎంసీలు, ఖాచాపూర్‌కు 2.50 టీఎంసీలు, ఇసాయిపేటకు 2.50 టీఎంసీలు, మంచిప్పకు 5 టీఎంసీల రిజర్వాయర్లకు, హైదరాబాద్‌ మంచినీటి సరఫరాకు 20 టీఎంసీలు మొత్తంగా 187.04 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుండి తరలిస్తారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ పనులు 60శాతం పూర్తికాగా, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల పనులు తుదిదశకు చేరాయి. మేడిగడ్డ బ్యారేజీ పూర్తికాకున్నా ఇపుడు నీటిపంపిణీ వ్యవస్థ ప్రారంభమయ్యే ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుండి మిడ్‌మానేరుకు జల ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా వ్యవస్థను రూపొందించారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు, లైనింగ్‌ వ్యవస్థ పూర్తయింది.

నందిమేడారంలో మరో రికార్డు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమవుతున్న ప్యాకేజీ-6నందిమేడారం ప్రత్యేకతల సమాహారంగా నిలిచి రికార్డు సృష్టిస్తోంది. నందిమేడారం అండర్‌ టన్నెల్‌ వద్ద భూగర్భంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాన్ని నెలరోజుల్లోనే పూర్తిచేస్తున్నారు. రూ.450కోట్లతో 400మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఆరునెలల్లో పూర్తికావాల్సిన విద్యుత్‌ కేంద్రాన్ని నెలరోజుల్లోనే ఏర్పాటుచేయడం విశేషం. భూమిపైన ఇలాంటి విద్యుత్‌ కేంద్రం నిర్మించేందుకు 65ఎకరాల స్థలం అవసరం కాగా, భూగర్భంలో కేవలం ఎకరం స్థలంలోనే విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుచేయడం మరో రికార్డు. 400మెగావాట్ల గ్యాస్‌ విద్యుత్‌తో ఏడుపంపులకు సరిపడా కరెంట్‌ సరఫరా అవుతుంది.

కాళేశ్వరం చూసొద్దాం
‘’’సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే పర్యాటక ప్రాంతంగా మారడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ అరుదైన ఘనత సాధించింది. ఈ ప్రాజెక్టును వీక్షించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ప్రత్యేక బస్సులను రూపొందించడం విశేషం. పర్యాటకులు ప్రతిరోజూ వందలు, వేలల్లో వెల్లువెత్తుతుండడంతో ప్రాజెక్టు పనులకు ఇబ్బందులు కలగకుండా పర్యాటకులకు ప్రాజెక్టు ప్రత్యేకతలు వివరించేందుకు ఇంజనీర్లను ప్రత్యేకంగా నియమించడం విశేషం. ఇపుడు ప్రతి ప్రాజెక్టు సైట్‌ వద్ద సందర్శకులకు ప్రాజెక్టు అద్భుతాలు వివరించేందుకు మ్యాప్‌లు, ఛాయాచిత్రాలతో ఇంజనీర్లు, ప్రాజెక్టును చూపిస్తూ వివరించేందుకు గైడ్‌లు దర్శనమిస్తారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్‌పర్సన్‌లు, జడ్పీటిసిలు, ఎంపిపిలు, పారిశ్రామికవేత్తలు, సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులు వేలాదిగా ప్రాజెక్టును సందర్శించారు. కేంద్రజలసంఘం చైర్మన్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అబ్బురపడి జలసంఘం ఇంజనీర్లు అందరినీ నేర్చుకోమని దశలవారీగా పంపుతున్నారు. గవర్నర్‌తో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా ప్రాజెక్టును సందర్శించి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సర్జ్‌పూల్‌, టన్నెల్స్‌ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతున్నాయి.

విమానాల్లో యంత్రపరికరాల దిగుమతి
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటున్న భారీ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన యంత్ర సామాగ్రి విదేశాల నుండి వస్తోంది. యూరప్‌ దేశాల్లో ప్రత్యేకంగా తయారుచేయించిన ఎలక్ట్రో మెకానికల్‌ పరికరాలు కాళేశ్వరం ప్రాజెక్టు ఒడిలో ఒదిగేందుకు విమానాలు, నౌకల ద్వారా భారత్‌కు వచ్చాయి. దేశంలోని హైదరాబాద్‌, చెన్నై, ముంబై ఎయిర్‌పోర్టులతో పాటు చెన్నై, ముంబై సముద్రతీర పోర్టులకు ఈ పరికరాలు చేరుకున్నాయి. ప్రధానంగా లింక్‌-1కు సంబంధించిన యంత్రసామాగ్రి దేశాన్ని చేరుకుంది. మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ ప్యాకేజీ 8పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టగా,
ఇందులో ఉపయోగించే యంత్రసామాగ్రిని ఎయిర్‌పోర్టులు, నౌకామార్గం ద్వారా తెప్పించింది. ఇప్పటికే ఇంపెల్లర్‌, పంప్‌సెట్‌ వంటి కొన్ని పరికరాలు ప్రాజెక్టు స్థలాలను చేరగా, పది షాఫ్ట్‌ సీల్స్‌ చెన్నై పోర్టుకు జూలై 7కు చేరనున్నాయి. మరో నాలుగుయూనిట్ల మోటార్లు ముంబై చేరాయి.

మహారాష్ట్రతో ఒప్పందమే టర్నింగ్‌ పాయింట్‌
కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియలో మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందమే కీలకంగా మారింది. తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందం 2016 ఆగస్టులో కుదిరింది. ముంబైలోని సహ్యాద్రి అతిధిగృహంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మహారాష్ట్ర , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలు, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టుల పరిశీలనకు అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందమే కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించిన అనుమతులన్నీ చకచకా సాధించడంలో కీలకమైంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ వ్యూహరచన, మంత్రి హరీష్‌ దాదాపు పదిసార్లు చేసిన పర్యటన ఫలించి.. కీలక ముందడుగు వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన అనుమతుల వివరాలు ఇలా ఉన్నాయి.

సంఖ్య అనుమతి తేదీ
1 పర్యావరణప్రభావ నివేదిక తయారీకి టిఓఆర్‌ 31.03.2017
2 మేడిగడ్డకు హైడ్రాలజీ క్లియరెన్స్‌ 30.10.2017
3. అంతర్రాష్ట్ర అనుమతి 03.11.2017
4. కేంద్రభూగర్భజలశాఖ అనుమతి 21.11.2017
5. నిర్మాణం,మెషినరీడెరెక్టరేట్‌ అనుమతి 21.11.2017
6. అటవీమంత్రిత్వశాఖ తుది అనుమతి 24.11.2017
7. పర్యావరణ తుది అనుమతి 05.12.2017
8. ఇరిగేషన్‌ ప్లానింగ్‌ 13.04.208
9. ప్రాజెక్టు అంచనా వ్యయం 01.05.2018

ఖరీఫ్‌కు రెడీ..
ఈ ఏడాది జూలై చివరికే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసి అక్కడి నుండి సొరంగమార్గాల ద్వారా మిడ్‌మానేరుకు నీటిని తరలించేందుకు ప్రభుత్వం శరవేగంగా పనులు చేయిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రాజెక్టు పనులను అత్యాధునిక కెమెరాల ద్వారా ప్రగతిభవన్‌ నుండే పర్యవేక్షిస్తూ తరచూ అధికారయంత్రాంగంతో సమీక్షలు జరుపుతున్నారు. మంత్రి హరీష్‌ తరచూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ అధికారులను ఉత్సాహపరచడంతో పాటు ప్రాజెక్టుల వద్దే నిద్రిస్తూ పనుల వేగానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 18లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 19లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుండగా.. తొలివిడతలో మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ ద్వారా కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలకు సాగునీరు అందించనున్నారు. 2018డిసెంబర్‌కు బ్యారేజీలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. పనులలో వేగం పెరిగింది. భారతదేశంలోనే ఒక చరిత్రసృష్టించే ప్రాజెక్టుగా కాళేశ్వరం జలపరిమళాలు వెదజల్లనుంది.

ప్రపంచరికార్డు: మంత్రి హరీష్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్టు అనేక అంశాల్లో ప్రపంచ రికార్డులు నమోదుచేస్తోంది. 19ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రాజెక్టు నిర్మాణం రికార్డు. తెలంగాణలోని 60శాతం భూభాగానికి ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు అందుతుంది. 22లిఫ్ట్‌లు, 21పంప్‌హౌజ్‌లు నిర్మిస్తుండగా.. ప్రపంచంలోనే తొలిసారి 139మెగావాట్ల సామర్ధ్యం గల పంపులను ఈ ప్రాజెక్టులో వాడుతున్నాం. 6వేల మంది ఇంజనీర్లు, 25వేల మంది కూలీలు ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తున్నారు. 1832కిమీ డిస్ట్రిబ్యూషన్‌ కాల్వలు నిర్మిస్తున్నారు. 203కిమీ అండర్‌ టన్నెల్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు పనులను చూసి కేంద్రజలసంఘమే ఆశ్చర్యపోయింది. తెలంగాణకు కాళేశ్వరం పచ్చనిహారం కానుంది.

– కంది.రామచంద్రారెడ్డి
…………………………………