మహిళల అక్రమ రవాణాను అరికట్టాలి. – ఎస్పీ అనూరాధ.

మహబూబ్ నగర్:


మహిళల అక్రమ రవాణాను నివారించటానికి గానూ, సమాజంలోని ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వర్తించవలసిన ఆవశ్యకత ఉన్నదని జిల్లా ఎస్.పి.అనురాధ అన్నారు. మహిళల అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం ఎన్.టి.ఆర్. మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎస్.పి. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్త్రీ మూర్తి వివిధ రూపాలలో కుటుంబానికి, సమాజానికి సేవలందిస్తూ మానవ మనుగడకు మూలమై నిలుస్తున్న విషయం అందరూ ఒప్పుకుంటున్నా, తగుస్థాయిలో గౌరవ మర్యాదలు ఇవ్వటానికి సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. మన ఉనికికి మూలమైన మహిళను అన్నివిధాలా కాపాడుకోవడం, అండగా నిలవడం సమాజపు ప్రాథమిక బాధ్యత కావాలని ఎస్.పి. పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఎస్.పి. మొక్కలు నాటుతూ, హరితహారం కార్యక్రమంలో పిల్లలు, యువత పెద్దఎత్తున పాల్గొనాలని, రేపటి తరానికి మంచి వాతావరణం అందించే బృహత్తర కార్యంలో మనందరం భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావించాలని వివరించారు.