మాజీ పీ.ఎం పీ.ఏ కి వేలకోట్ల ఆస్తులు

ఇస్లామాబాద్;

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో పాటు ఆయనకు సన్నిహితులుగా మెలిగినవారికీచిక్కులు తప్పడం లేదు. షరీఫ్ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఫవాద్ హసన్ ఫవాద్ ఆస్తులపై పాకిస్థాన్ దర్యాప్తు సంస్థ, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) దాడులు చేసింది. ఈ దాడుల్లో వేల కోట్లు దొరికినట్టు ఎన్ఏబీ ప్రకటించింది. ఆషియానా ఇక్బాల్ హౌసింగ్ కుంభకోణం, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై ఫవాద్ పై విచారణ కొనసాగుతోంది.

ఆయనను జూలై 5న ఎన్ఏబీ అరెస్ట్ చేసింది. ఫవాద్ హసన్ ఫవాద్, పాక్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి అత్యంత సన్నిహితుడైన జుల్ఫీబుఖారీలు దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. వీళ్లిద్దరిని ఎగ్జిట్ కంట్రోల్ లిస్టు(ఈసీఎల్)లో పెట్టినట్టు అన్ని ఎయిర్ పోర్టులకు తెలియజేసింది. తనను ఈసీఎల్ లో చేర్చడంపై జుల్ఫీ బుఖారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ స్నేహితుడైనందుకే తనను మాజీ హోమ్ మంత్రి ఎహ్సాన్ ఇక్బాల్ టార్గెట్ చేశారని బుఖారీ ఆరోపించారు. సరిగ్గా పీఎంఎల్-ఎన్ ప్రభుత్వం ఆఖరు రోజున తన పేరును బ్లాక్ లిస్టులో పెట్టారని చెప్పారు. బుఖారీకి విదేశాలలో ఉన్న పలు ఆఫ్ షోర్ కంపెనీలు పనామా పేపర్లలో వెలుగు చూడటంతో ఆయనపై ఎన్ఏబీ దర్యాప్తు ప్రారంభించింది. అలాగే లాహోర్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎల్డీఏ) మాజీ డైరెక్టర్ జనరల్ అహద్చీమాపై కూడా బ్యూరో కేసు నమోదు చేసింది.