మాటలు బారెడు, చేతలు బెత్తెడు

‘తాము తప్ప తెలంగాణలో మరో రాజకీయ వేదిక ఉండకూడదు. తమ తప్పులు ఎత్తిచూపే మీడియా వ్యవస్థ ఉండకూడదు. అసెంబ్లీలో సమస్యలపై తమను నిలదీసే ప్రతిపక్షం ఉండకూడదు. ప్రజలు, రాజకీయ పార్టీలు తమకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు’.అనే ధోరణిలో కెసిఆర్ జనరంజక పాలన సాగుతున్నది.

ఎస్.కె.జకీర్.

కెసిఆర్ పాలనకు నాలుగేళ్లు పూర్తయినవి.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒకానొక చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టిన విషయాన్ని అందరూ మరచిపోతున్నారు.ఆ పార్టీ వ్యవస్థాపక సారధి కెసిఆర్ కనుక లాభ నష్టాలన్నీ ఆయన ఖాతాలోనే జమ అవుతాయి.’ కత్తి ఒకరికి ఇచ్చ్చి మరొకరిని యుద్ధం చేయమంటే ఎలా’ అని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు లక్షలాదిమందిని కదిలించినవి.ఉత్తేజపరచినవి.ఉర్రూతలూగించినవి. కనుక కత్తి పట్టిన కెసిఆర్ కే తొలి విడత పాలనాపగ్గాలను ప్రజలు అప్పజెప్పారు.ఆయన బాధ్యతాయుతంగా, జవాబుదారీగా ప్రజల నమ్మకాన్నినిలబెట్టుకున్నారా లేదా అన్నది సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జోస్యం చెప్పడం తగదు. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.ప్రజలు కోరుకున్న విధంగానే పరిపాలన సాగుతున్నదా లేదా అన్నదానిపై ప్రజలదే అంతిమతీర్పు.కారణాలేవైనా కావచ్చు కానీ ‘మాటలు బారెడు- చేతలు బెత్తెడు’ అనే నిందను కెసిఆర్ మోస్తున్నారు.ఇది నిందేనా? లేక నిజమూ ఉన్నదా?అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది.ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి , రైతుబందు తదితర పెక్కు పధకాలు కనీసం కోటిమందికి పైగా ఎదో ఒక రూపంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయన్నది కెసిఆర్ వాదన. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతున్నవి.ఇంటింటికీ సురక్షిత తాగునీటి పంపిణీ, చెరువుల పునరుద్ధరణ కోసం జరుగుతున్న మిషన్ కాకతీయ,కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన తాత్విక భూమిక అయిన ‘తెలంగాణ వాదం’ నుంచి క్రమంగా తప్పుకుంటున్నట్లు ప్రజలకు కనిపిస్తున్నది. అర్ధమవుతున్నది.తెలంగాణ వాదం అంటే ‘ఆత్మగౌరవం,స్వయంపాలన’ తప్ప మరేమీ కాదు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆత్మగౌరవం తోనే జీవిస్తున్నారా?లేదా ?అనే అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు.పైగా ‘కుటుంబపాలన’ అనే దృశ్యం బహిరంగంగా కనిపించేలా కెసిఆర్ చర్యలు కనిపిస్తున్నవి.కేటిఆర్, కవిత, హరీశ్ రావు ఎవరికీ వారే నాయకత్వస్థాయికి వచ్చి రుజువు చేసుకుంటున్నారని కెసిఆర్ సమర్ధించవచ్చును.మరి నూతన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ను ఎలా ఎంపిక చేస్తారని ఇటీవల ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో కేవలం దినపత్రికలు మాత్రమే చదివే అలవాటు ఉన్న ఒక ఉపాధ్యాయుడు ఒక విలేకరిని అడిగాడట.దీన్ని బట్టి ప్రజలు, వివిధ రంగాల్లో, వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఎంత లోతుగా విషయాలను అర్ధం చేసుకుంటారో సులభంగా అంచనా వేయవచ్చును.తెలంగాణ ఉద్యమంలో సహకరించిన వారిని ద్రోహులుగా చిత్రీకరణ జరుగుతున్నది.తెలంగాణ ఉద్యమ కార్యకర్తలపై దాడులు చేసిన వారు,ఉద్యమాన్ని కించపరచిన వారు ప్రభుత్వానికి, కెసిఆర్ కు ప్రియులుగా మారడం విషాదం. ఈ ప్రశ్న అడిగిన వారికి ’ఉద్యమ కాలం వేరు.ఇది ప్రభుత్వం.దీని ప్రాధాన్యతలు వేరు.రాజకీయ పునరేకీకరణ అవసరం.సుపరిపాలన అవసరం.ఇంకా ఉద్యమ కార్యకర్తలు,త్యాగాలు, అమరులు” అనే మాటలకు కాలం చెల్లిందనే జవాబు రావచ్చును.‘తాము తప్ప తెలంగాణలో మరో రాజకీయ వేదిక ఉండకూడదు. తమ తప్పులు ఎత్తిచూపే మీడియా వ్యవస్థ ఉండకూడదు. అసెంబ్లీలో సమస్యలపై తమను నిలదీసే ప్రతిపక్షం ఉండకూడదు. ప్రజలు, రాజకీయ పార్టీలు తమకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు’.అనే ధోరణిలో కెసిఆర్ జనరంజక పాలన సాగుతున్నది. తాము చాలా తెలివిగల వాళ్ళమని, తమకు తెలియనిదేమీ లేదని చాలా మంది రాజకీయనాయకులలో ఒక భ్రమ నాటుకొని ఉంటుంది.ప్రజలు అంతకన్నా వెయ్యి రెట్ల తెలివిగలవారని,పాలకుల కన్నా వెయ్యి రెట్ల బలవంతులని తెలియడానికి తగిన సమయం రావలసిందే.