“మాయావతి మంచి నిర్ణయం తీసుకున్నారు”. – సుబ్రహ్మణ్యస్వామి.

 న్యూఢిల్లీ:
మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోరాదన్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సమర్థించారు. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి సిద్ధమైన బీఎస్పీ అధినేత్రి మాయావతి మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. బెహన్జీ నాయకత్వంలో బీఎస్పీ ఎవరితోనూ ఎన్నికల పొత్తు పెట్టుకున్న దాఖలాలు లేవని గుర్తు చేశారు. అందుకే ఆమె సొంత బలంతో బరిలోకి దిగాలని మంచి నిర్ణయమే తీసుకున్నారని బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తో మహాకూటమి నిజాయితీకి సంబంధించినది కాదని స్వామి చెప్పారు. విధానపరంగా పరస్పర విరుద్ధమైన బీఎస్పీ, కాంగ్రెస్ లు కలిసి సాగడం సాధ్యం కాదన్నారు. కేవలం ఇద్దరి ఓటు బ్యాంకు ఒకటే అయినంత మాత్రాన భిన్నధృవాలు ఒకటి కాలేవని చెప్పారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ దళిత ఓటు బ్యాంకుని కొల్లగొట్టేందుకు వ్యూహం రచించిందని ఆరోపించారు. కాంగ్రెస్ తన భాగస్వామ్య పక్షాలు వేటిని సొంతంగా బలపడనీయ లేదని సుబ్రహ్మణ్య స్వామి గుర్తు చేశారు.