మారిన ఎన్ఎస్ఈ లోగో

న్యూఢిల్లీ;
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (ఎన్ఎస్ఈ) ఏర్పాటై 25 ఏళ్లయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్ఈ సరికొత్త లోగోను ఆవిష్కరించింది. కొత్త చిహ్నంలో పాత లోగోలోని బ్రౌన్ కలర్ కి బైబై చెప్పి ఆకర్షణీయమైన బంతిపువ్వు రంగు, పసుపు, ఎరుపు, నీలం రంగులను చేర్చారు. నిజాయితీ, శ్రేష్ఠత, నమ్మకం, నిబద్ధతలకు సూచనగా ఈ నాలుగు రంగులు ఎంపిక చేసినట్టు తెలిసింది. ఎరుపు బలమైన పునాదికి, పసుపు, నారింజ రంగు సంపదకు, బంతిపూవు రంగు పవిత్రతకు, నీలం రంగు త్రికోణం భవిష్యత్తుకు దిగ్దర్శినిగా ఎంపిక చేశారు.
అలాగే చతురస్రాకార చిహ్నాన్ని పూర్తిగా మార్చేసి వలయాకార నిర్మాణంగా రూపొందించారు. రజతోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ కొత్త లోగోను విడుదల చేశారు. వ్యాపారంలోని బహుముఖ పార్శ్వాలను కొత్త లోగో ప్రతిఫలిస్తుందని ఎన్ఎస్ఈ తెలిపింది.