“మా అబ్బాయి చాలా మంచోడు”. ఒసామా బిన్ లాడెన్ తల్లి.

లండన్:
స్వతహాగా సౌమ్యుడు, మంచివాడైన ఒసామా బిన్ లాడెన్ ను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదిగా మార్చారా? మార్చారనే అంటోంది అతని తల్లి. విధ్వంస రచన, మారణ హోమాలతో ప్రపంచాన్ని అట్టుడికించిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు నాయకత్వం వహించిన బిన్ లాడెన్ స్వతహాగా చాలా మంచివాడని తల్లి ఆలియా ఘానెమ్ కితాబిచ్చింది. ప్రపంచంలో అతి భయంకర ఉగ్రవాదిగా పేరు మోసిన ఒసామా బిన్ లాడెన్ చిన్నతనంలో మహా సిగ్గరి. చదువులో మాత్రం లాడెన్ చాలా చురుకు. 20 ఏళ్లు వచ్చే వరకు అతనికి ఉగ్రవాదం అనే మాటకు అర్థం కూడా తెలియదు. ఎంతో బలవంతుడైనా ఎవరితో గొడవలు పడకుండా చాలా సౌమ్యంగా వ్యవహరించేవాడు. ఇవి లాడెన్ తల్లి ఆలియా ఘానెమ్ మాటలు. లాడెన్ చనిపోయిన ఏడేళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆలియా, ఒసామా గురించి అనేక విషయాలను వివరించింది.లాడెన్ పుట్టిన కొంత కాలానికి ఘానెమ్ తన భర్తకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకొంది. సౌదీ అరేబియాలోని జెడ్డా కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీలో లాడెన్ ఎకనామిక్స్ చదువుకొనే రోజుల్లో కొందరితో పరిచయం అతనిని ఉగ్రవాదంవైపు నడిపించిందని తెలిపింది. వాళ్లు బ్రెయిన్ వాష్ చేయడంతో అతను కరడు గట్టిన ఉగ్రవాదిగా మారాడని చెప్పింది. ఉగ్రవాదులతో పరిచయం ఒసామాని పూర్తిగా మార్చేసిందని.. ప్రపంచవ్యాప్తంగా కరడుగట్టిన ఉగ్రవాదానికి చిరునామాగా మారాడని అంది. బ్రిటన్ కు చెందిన ప్రముఖ దినపత్రిక ‘ది గార్డియన్‘కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఘానెమ్ లాడెన్ కి గురించి పలు ఆసక్తికర సంగతులు తెలియజేసింది.కింగ్ అబ్దుల్లా అజీజ్ యూనివర్సిటీలో చదువుకొనే రోజుల్లో లాడెన్ కి అబ్దుల్లా ఆజమ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను సౌదీ అరేబియాలో నిషేధిత ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థ సభ్యుడు. ఆ తర్వాత అతను ఒసామాకు గురువయ్యాడు. యూనివర్సిటీలో మరికొందరు లాడెన్ ను తమ మాటలతో పూర్తిగా మార్చేశారు. అతను పూర్తిస్థాయిలో ఉగ్రవాదిగా మారిన తర్వాతే తనకు అతను ఎంచుకున్న మార్గం గురించి తెలిసిందని వాపోయింది. తనలాంటి కష్టం మరెవరికీ రాకూడదని చెప్పింది ఆలియా ఘానెమ్. తన మొదటి సంతానమైన ఒసామాకు తనంటే ప్రాణమని కళ్లనీళ్లు పెట్టుకొంది. చివరిసారిగా తను లాడెన్ ను 1999లో ఆఫ్గనిస్థాన్ లో చూసినట్టు ఆలియా తెలిపింది. అంతకు ముందు రెండుసార్లు వెళ్లినప్పటికీ ఒసామా అప్పుడు కాందహార్ బయట రహస్యంగా నివసిస్తుండటంతో వీలు పడలేదు. 2011లో అమెరికా పాకిస్థాన్ లో బిన్ లాడెన్ ను వెతికి చంపేవరకు ప్రపంచదేశాలన్నీ అల్ ఖైదా పేరెత్తితేనే వణికిపోయేవి.