‘మిషన్ కాకతీయ’ప్రభావంపై ఇరిగేషన్ శాఖ అధ్యయనం.

హైదరాబాద్:
మిషన్ కాకతీయ ఫలితాలు – ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు ‘ఇక్రిసాట్’ తో తెలంగాణ ఇరిగేషన్ శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకున్నది. మంత్రి హరీశ్ రావు సమక్షంలో ‘కాడా’ కమిషనర్ మల్సూర్, ‘ఇక్రిసాట్’ తరపున ఇక్రిసాట్ డైరక్టర్ జనరల్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద రెండేళ్ల పాటు మిషన్ కాకతీయ ఫలితాలు- వాటి ప్రభావంపై ఇక్రిసాట్ అధ్యయనం చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. తొలి విడత, రెండో విడతలో పునరుద్ధరించిన చెరువుల ఫలితాలు- ప్రభావంపైన ఈ అధ్యయనం జరగనుంది. చెరువు మట్టి ద్వారా రైతులు ఎలాంటి లాభాలు పొందారు, పంట దిగుబడి ఎంత పెరిగిందన్న అంశాలను ఈ అధ్యయనంలో పరిశీలించనున్నారు. చెరువుల పునరుద్ధరణ జరిగి ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు జరిగిన తీరును ఇక్రిసాట్ అధ్యయనం చేయనుంది. చెరువు మట్టి ద్వారా పంట దిగుబడి మాత్రమే కాకుండా రైతుకు ఆర్థికంగా చెకూర్చిన లాభాలను ‘ఇక్రిసాట్’ పరిశీలనలోకి తీసుకోనుంది.మిషన్ కాకతీయ ఫలితాలు- ప్రభావాలపై ఇప్పటికే నాబ్కాస్స్ ( నాబార్డ్ అనుబంధ) సంస్థ అధ్యయనం జరిపింది. మిషన్ కాకతీయ అమలు వల్ల 2016 ఖరీఫ్ లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోయినా 51.5 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని అధ్యయనంలో తేలింది. ఈ నిష్పత్తిలో చెరువుల కింద సుమారు 10.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడుతుందని అంచనా. 2013-14లో గ్యాప్ ఆయకట్టు 42.4 శాతం ఉంటే, 2016-17లో 23.2కు తగ్గింది. అంటే మిషన్ కాకతీయ కారణంగా ఆయకట్టు గ్యాప్ ఖరీఫ్, రబీ కలుపుకుని 19.2 శాతానికి తగ్గింది. పత్తిసాగు విస్తీర్ణం 36.2 శాతం నుంచి 26.3 శాతానికి తగ్గి వరి సాగు విస్తీర్ణం పెరిగినట్లు అధ్యయనంలో తెలింది. చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భజలాలు పెరిగినట్లు నాబ్కాస్స్ పేర్కొంది. మట్టి పూడికతీత వల్ల ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గినట్లు రుజువయింది. పంట దిగుబడి పెరిగి రైతుల ఆదాయం పెరగడంతో పాటు, చేపల ఉత్పత్తి పెరిగిందని తేలింది. ఇలాంటి అంశాలను కాడా కమిషన్ తో ఒప్పందం అనంతరం ఇక్రిసాట్ అధ్యయనం చేయనుంది. అయితే నాబ్కాన్స్ సంస్థ అధ్యయన పరిధికి పరిమితులున్నాయి. ఇక్రిశాట్ సంస్థ అధ్యయనం సమగ్రమైనది. ‘ఇక్రిశాట్’ అధ్యయనం ముగిసేనాటికి మిషన్ కాకతీయ 5 దశలు ముగియనున్నవి.