“మీటూ” ఎఫెక్ట్: ఏడుగురిని ఆహ్వానించని మద్రాస్ మ్యూజిక్ అకాడమీ!!

న్యూఢిల్లీ:
దేశంలో అన్ని రంగాలను పట్టి కుదుపుతున్న మీటూ ఉద్యమ సెగ ఇప్పుడు కర్ణాటక సంగీత రంగాన్ని తాకింది. లైంగికంగా వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సంగీత రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన ఏడుగురు విద్వాంసులను మద్రాస్ మ్యూజిక్ అకాడమీ డిసెంబర్ లో జరిగే మార్గాళి సంగీతోత్సవం నుంచి తప్పించింది. ఈ ఏడాది ఉత్సవాల్లో ఎన్. రవికిరణ్, ఓఎస్. త్యాగరాజన్, మన్నార్ గుడి ఏ. ఈశ్వరన్, శ్రీమూష్ణం వి. రాజారావు, నాగై శ్రీరామ్, ఆర్. రమేష్, తిరువారూర్ వైద్యనాథన్ ప్రదర్శనలు ఉండబోవని మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రకటించింది. కర్ణాటక సంగీతం, భరతనాట్యం శిక్షణ, ప్రదర్శన, ప్రచారం కోసం మద్రాస్ మ్యూజిక్ అకాడమీ పేరొందింది. ప్రతి ఏడాది శీతాకాలంలో మార్గాళి పేరుతో సంగీత నృత్యోత్సవం నిర్వహిస్తోంది. దీనికి వేలాదిగా రసజ్ఞులైన ప్రేక్షకులు హాజరవుతారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా దేశంలో కొనసాగుతున్న మీటూ ఉద్యమానికి మద్దతుగా ఏడుగురు విద్వాంసులను ఈ సారి ఆహ్వానించ రాదని నిర్ణయం తీసుకున్నట్టు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి తెలిపారు. ఇన్నేళ్లుగా తమ బాధను ప్రపంచానికి చెప్పకుండా మౌనంగా భరించిన బాధితులకు సానుభూతి తెలపాలని తాము భావించినట్టు చెప్పారు. మా సంస్థకున్న ప్రతిష్ఠను నిలిపేందుకు ఇది తప్పనిసరైందని అన్నారు. మీటూ తుపానుని చూసీ చూడనట్టు వదిలేయబోమని మురళి తెలిపారు.