‘మీటూ’ దెబ్బకు గూగుల్ విలవిల.

ప్రకాశ్, న్యూఢిల్లీ:

ప్రపంచ అగ్రగామి టెక్ దిగ్గజ సంస్థ మీటూపై కఠిన చర్యలు చేపట్టింది. రెండేళ్లు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 48 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. వీళ్లలో 13 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. టెక్నాలజీ రంగంలో దిగ్గజ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తరఫున తొలగింపు ప్రకటనను జారీ చేసింది. ఆండ్రాయిడ్ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆండీ రూబిన్ తనను లైంగింకంగా వేధించారని గూగుల్ కి చెందిన ఒక సీనియర్ ఉద్యోగి న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన కథనంలో పేర్కొనడంతో కంపెనీ చర్యలకు నడుం బిగించింది. ఆండీ రూబిన్ కి 9,00,00,000 డాలర్ల (రూ.666,00,00,000) భారీ ఎగ్జిట్ ప్యాకేజీ ఇచ్చి సాగనంపింది. అలాగే ఇతర లైంగిక వేధింపుల ఆరోపణలపై కూడా ఇదే తరహాలో చర్యలు చేపట్టనున్నట్టు గూగుల్ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ కేంద్రాలన్నిటిలో ఈ వార్త పెను కలకలం రేపింది. దీనిపై గూగుల్ స్పందనను తెలుసుకొనేందుకు వెళ్లిన మీడియాకు కంపెనీ పిచాయ్ ఉద్యోగులకు రాసిన ఓ ఈ-మెయిల్ అందజేసింది. గత రెండేళ్లలో 13 మంది సీనియర్ ఉద్యోగులు, ఆపై పదవిలో ఉన్నవారితో సహా మొత్తం 48 మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ఆ ఈ-మెయిల్ లో పేర్కొన్నారు. వారిలో ఎవరికీ కూడా ఎగ్జిట్ ప్యాకేజీ అందజేయడం లేదని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా కంపెనీలో చేపట్టిన పలు మార్పులలో ఉన్నతోద్యోగులు అనుచితంగా ప్రవర్తించడంపై కఠిన చర్యలు తీసుకోవడం కీలకమైనదని పిచాయ్ తెలిపారు. రూబిన్, ఇతరులపై వచ్చిన వార్తలు కల్పితాలని తేల్చి పారేశారు. మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఆయన సూటిగా జవాబు ఇవ్వలేదు.

సురక్షితమైన పరస్పర సహకారం వెల్లివిరిసే పని వాతావరణం కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని పిచాయ్ చెప్పారు. కంపెనీలో లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనకు చెందిన ప్రతి ఫిర్యాదుపై సమీక్ష జరుపుతామని హామీ ఇస్తున్నట్టు తెలిపారు. మరోవైపు రూబిన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన తరఫు ప్రతినిధి స్పష్టం చేశారు. ఆయన తన సొంత కంపెనీ ప్రారంభించేందుకే గూగుల్ ని వీడారని చెప్పారు.