‘మీటూ’ ని పెర్వర్ట్ లు ప్రారంభించారు.


ప్రకాశ్, న్యూఢిల్లీ.
భారతదేశంలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక పెద్ద పేరు బయటికొస్తోంది. తమను లైంగికంగా వేధించారంటూ సినిమా రంగం, మీడియా నుంచి పలువురు ధైర్యంగా పేర్లు బయటికి చెబుతున్నారు. మొన్న బుధవారం లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా విదేశాంగశాఖ సహాయమంత్రి ఎంజె అక్బర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామాపై మోడీ సర్కార్ లోని ఒక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మీటూ ఉద్యమాన్ని వికృత మనస్తత్వం ఉన్నవాళ్లు (పర్వర్ట్ లు) ప్రారంభించారని వ్యాఖ్యానించి కేంద్ర ఆర్థిక, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సంచలనం సృష్టించారు. కొన్ని ఏళ్ల కిందట జరిగిన సంఘటనల గురించి ఇప్పుడు ఆరోపణలు చేయడంలోని ఔచిత్యాన్ని రాధాకృష్ణన్ ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన ఎంజె అక్బర్ సహా పలువురు ప్రముఖులకు మీటూ ఉద్యమ సెగ తగిలింది. వారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. రాజకీయాల్లోకి రాకముందు పలు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించింన అక్బర్ తన కింద పనిచేసే పలువురు మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించారని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సంఘటనను ఎద్దేవా చేస్తూ బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ ‘ఎవరైనా తనపై ఇలా జరిగిందని ఆరోపిస్తారు.. ఆ ఘటన జరిగినపుడు మేము ఐదో తరగతిలో కలిసి ఆడుకుంటున్నాం.. అని చెప్పడం సబబా?’ అని ప్రశ్నించారు. ఈ మీటూ వికృత మనస్తత్వం ఉన్న కొందరి ప్రవర్తన ఫలితం అని పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. మీటూ ఉద్యమం దేశ, మహిళల ప్రతిష్ఠను దెబ్బ తీస్తోందన్నారు. పురుషులు కూడా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేస్తే అంగీకరిస్తారా? అని నిలదీశారు. అది చాలా అవమానకరమని.. అలాంటివి ఆమోదయోగ్యమేనా? అన్నారు.లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రారంభమైన మీటూ ఉద్యమంలో నటుడు నానా పటేకర్, అలోక్ నాథ్, షోమ్యాన్ సుభాష్ ఘాయ్, రచయిత చేతన్ భగత్, గాయకుడు కైలాష్ ఖేర్, తమిళ గీతరచయిత వైరముత్తుతో సహా పలువురు ప్రముఖులపై ఆరోపణలు వచ్చాయి.