‘మీ టూ’ పై నోరు విప్పిన స్మృతి ఇరానీ.

న్యూఢిల్లీ:

మీటూ ఉద్యమంలో భాగంగా విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎట్టకేలకు ఒక కేంద్ర మంత్రి నోరు విప్పారు. ఈ వ్యవహారంపై ఎంజె అక్బర్ మాత్రమే వివరణ ఇవ్వగలరని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. సంఘటన జరిగినపుడు తను అక్కడ లేనందువల్ల దీనిపై తను వివరణ ఇవ్వడం సబబు కాదని స్మృతి చెప్పారు. మీడియా తమ మహిళా సహోద్యోగులకు మద్దతు ఇవ్వడం హర్షణీయమని ఆమె వ్యాఖ్యానించారు. మీటూ ఉద్యమంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటపెట్టిన మహిళలను సిగ్గు పడేలా చేయడం కానీ, వారిని గేలి చేయడం కానీ చేయరాదని ఆమె సూచించారు. ఒక మహిళ తన కలలను సాకారం చేసుకొనేందుకు పని చేస్తుందని.. ఎవరైనా వారితో చెడుగా ప్రవర్తిస్తే సహించరాదని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో మహిళలు ధైర్యంగా తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పేటపుడు వారి నోరు నొక్కే ప్రయత్నం చేయరాదన్నారు. బాధిత మహిళలందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. తమతో ఎవరు ఎలా వ్యవహరించారో ముందుకొచ్చి చెబుతున్న మహిళల ధైర్యం ప్రశంసనీయమని కేంద్ర మంత్రి చెప్పారు. మీటూ ఉద్యమంలో భాగంగా ఇటీవల కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయన ఎడిటర్ గా ఉన్నపుడు తమను లైంగికంగా వేధించారని ఎందరో మహిళా జర్నలిస్టులు తెలిపారు. వారు సోషల్ మీడియా ద్వారా అక్బర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.