‘ముందస్తు’ కసరత్తు.

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్రం లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించి పలు అంశాలను పరిశీలించిన విషయం తెలిసిందే. మరో రెండుసార్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించిన తర్వాత ఎన్నికలను నిర్వహించాలా వద్దా అనే అంశంపై అధికారికంగా వెల్లడించనున్నది. రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి వెల్లడించిన విషయం తెలిసిందే.
దీంతో ముందస్తు కోసం రాష్ట్రంలో చేయాల్సిన పనులపై ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రారంభించినట్లు తెలిసింది. గడిచిన రెండు రోజుల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) నియమించినట్లు జిల్లా కలెక్టర్లు ఎన్నికల ప్రధానాధికారికి నివేదికను అందించినట్లు తెలిసింది. బీఎల్‌ఓల ప్రక్రియను మండల తహశీల్ధార్లు చేపట్టారు. బీఎల్‌ఓలుగా వీఆర్‌ఏలను నియమించినప్పటికీ అన్ని బూత్‌లకు సరిపోవడం లేదు. దీంతో అయా గ్రామాల్లో మహిళా సంఘాల నిర్వహణకు పనిచేస్తున్న వీఓఏలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లను బీఎల్‌ఓగా నియమించినట్లు తెలిసింది. బీఎల్‌ఓ నియమించిన వారి నుంచి ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలను కూడా తీసుకున్నారు.దీంతో అయా మండలాల్లో ఏయే బూత్‌ల్లో బీఎల్‌ఓ పనిచేస్తున్నారనే నివేదికను అయా జిల్లా కలెక్టర్లకు సమర్పించినట్లు తెలిసింది. దీంతో బీఎల్‌ఓ ప్రక్రియను దాదాపు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జిల్లా కలెక్టర్లు సమర్పించినట్లు సమాచారం. బీఎల్‌ఓల పనివిధానంపై మండల, నియోజకవర్గ స్థాయిల్లో బీఎల్‌ఓలకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఈ వారంలోగా శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు మండల యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం 32వేల మంది సిబ్బంది అవసరముంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ సిబ్బందిలో పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఎన్నికల పనుల కోసం జిల్లాస్థాయి అధికారుల నియామకం చేయాల్సి ఉంది.72మంది అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నియమించాల్సి ఉంది. వీరిలో నలుగురు అధికారులను మాత్రమే నియమించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను వేగంగా చేసేందుకు మరి కొంత సమయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయిన్పప్పటికీ అయా జిల్లాల నుంచి అధికారుల జాబితాను సేకరిస్తున్నట్లు తెలిసింది. దీన్నిబట్టి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందస్తుపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఇంకా నియామకాలు చేపట్టలేదని తెలిసింది. కానీ ప్రాథమికంగా చేయాల్సిన పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు ఆదేశిస్తే సిద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది