ముగ్గురు ‘స్నేహితులు’ !?

ఎస్.కె. జకీర్.
రాజకీయాలు రాజకీయాలే. స్నేహం స్నేహమే. అయితే వేర్వేరు పార్టీల ప్రత్యర్థుల మధ్య ‘స్నేహం’ ఆ పార్టీల క్యాడర్ ను గందరగోళంలోకి నెడుతున్నది. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల ‘యుద్ధం’ ఎంత తీవ్రంగా సాగుతున్నదో అందరూ చూస్తున్నారు. నువ్వా నేనా అన్నరీతిలో కొట్లాడుకుంటున్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొన్ని దృశ్యాలు చాలామందికి మింగుడుపడడం లేదు. జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ టిఆర్ఎస్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎం.పి. పొన్నం ప్రభాకర్ ల మధ్య ‘మైత్రీ బంధం’ మొగ్గతొడిగి, వికసించింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కు ‘ఫైర్ బ్రాన్డ్’ గా పేరున్నది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పొన్నంకు మాటలపిట్ట అనే బిరుదు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలుకుంటే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎం.పి. కవితను అవసరమైన సందర్భాలలలో చెండాడుతుంటారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒకరిద్దరి పట్ల పొన్నం సానుకూల దృక్పథంతో, స్నేహపూర్వక ‘ శతృత్వాన్ని’ కొనసాగిస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణులంటున్నవి. ఒకరిద్దరి నేతల విషయంలో మాత్రం మారు మాట్లాడకపోవడమే ఇప్పుడు చర్చ. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తీరుపై పలు పలు ఆరోపణలున్నప్పటికీ పొన్నం ప్రభాకర్ ఆయన ‘జొలికి’ పోవడం లేదన్న విమాశ్రయా ఉన్నది. వక్ఫ్‌బోర్డ్‌ ల్యాండ్ ఆక్రమణ చేసి ఫాంహౌస్‌ కట్టినట్టు వస్తున్న ఆరోపణలు, సీతారాంపూర్‌ భూకుంభకోణాల ఆరోపణలు, స్మార్ట్‌సిటీ నిధుల వాడకానికి సంబంధించి తన కాంట్రాక్టర్లతోనే పనులు నడిపిస్తున్నారన్న ఆరోపణల విషయంలోగానీ ఎక్కడా, ఎప్పుడూ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడకపోవడం రాజకీయంగా చర్చ కు దారి తీస్తున్నది. అంతేకాదు… అధికార, ప్రతిపక్షాలకు మధ్య పెద్ద రాజకీయ రగడకు తెరతీసిన ఆర్ట్స్‌ కళాశాల కూల్చివేత విషయంలోనూ పొన్నం ‘మౌనం’ అనుమానాలకు ఆస్కారం కల్పిస్తున్నది. ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్మించే హోటళ్లు, మినీ థియేటర్‌ వంటి వాటిల్లో పొన్నంకు కూడా ‘వాటాలు’న్నట్టు ఆరోపణలు వస్తున్నవి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పైన ఆరోపణలు చేయాలంటే పొన్నం అనుచరులు విలేకరుల సమావేశాలు పెడుతున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేయాలంటే మేయర్‌ రవీందర్‌సింగ్ , లేదా ఎమ్మెల్యే గంగుల అనుచరులు విలేకరుల సమావేశాలు పెడుతున్నారు. ఈ పరిణామాలు ‘పార్టీలకతీతంగా సాగుతున్న మైత్రి’కి నిదర్శనమని కొందరు నిందిస్తున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఇద్దరూ మంచి ‘స్నేహితులు’. ఇద్దరూ బీసీ సామాజికవర్గానికి చెందినవారు. ఈక్రమంలోనే వీరిద్దరూ ‘పరస్పర అవగాహన’తో కరీంనగర్‌లో రాజకీయాలు నడుపుతున్నట్టు వాదన ఉంది. మంత్రి ఈటెల రాజేందర్‌ కూడా బీసీ సామాజికవర్గం వారే కావడంతో పొన్నం ప్రభాకర్ మంత్రి పట్ల కూడా ‘ సానుభూతి’ గా ఉంటున్నట్టు సమాచారం. కొన్ని సందర్భాలలో మంత్రి ఈటెల పై మాట్లాడినా అందులో ‘పదును’ ఉండడం లేదని అంటున్నారు. పొన్నం బంధువుకు సంబంధించిన ఓ సాఫ్ట్‌వేర్‌ స్టార్టప్‌ కంపెనీని హుజూరాబాద్‌లో ఏర్పాటు చేయడం పై కూడా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ హయాంలో అనుమతి లభించని గ్రానైట్‌ క్వారీలకు టీఆర్ఎస్ హయాంలో అనుమతి లభించడం కూడా ఇప్పుడు మరో చర్చ. ఇటీవలి కాలంలో ఈటెల తో పొన్నం ‘సంబంధ బాంధవ్యాలు’ బలపడినట్టు తెలియవచ్చింది. ఓ దశలో పొన్నం గులాబీ కండువా కూడా కప్పుకునే అవకాశాలు లేకపోలేదంటూ వదంతులు వచ్చినవి.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు టిఆర్ ఎస్ కుపడేలా, ఎం. పిగా తనకు పడేలా పొన్నం ప్లాన్‌ చేసుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఆ అంశం తెలిసి నివ్వెరపోయిన కరీంనగర్ ఎంపీ వినోద్‌ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు టిఆర్ఎస్ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. చొప్పదండి శాసన సభ్యురాలు టిఆర్ఎస్ కు చెందిన శోభ అత్త చనిపోయినపుడు ఆమెను పరామర్శించిన తీరు కూడా వివాదాస్పదమవుతున్నది.