మున్నార్ లో నీలకురింజి సందడి


కేరళ:

ఒక్కసారి కళ్లు మూసుకొని ఊహించుకోండి.. మీరు ఎటువైపు చూసినా కనుచూపుమేరంతా నీలం రంగులో పూలు పరచుకొని ఉన్నాయి. నేలపై, కొండలపై ఎక్కడా అంగుళమైనా ఖాళీ స్థలం వదలకుండా ఎవరో అద్భుతమైన నేతగాడు తన పనితనంతో తయారుచేసిన అందమైన తివాచీలనుపరిచినట్టుగా పూర్తిగా విచ్చుకున్న పూలు కనిపిస్తే ఎలా ఉంటుంది? కళ్లకు ఇంపుగా మనసును ఉల్లాసపరిచే ఇలాంటి ప్రకృతి దృశ్యం ఊహించుకుంటేనే మనసు ఆనంద పరవశమవుతుంది. అలాంటి ఊహ నిజంగా కళ్ల ముందు నిలిస్తే కచ్చితంగా మది గదులు ఆనందంతో నిండిపోతాయి. సరిగ్గా ఇలాంటి దృశ్యమే ఇప్పుడు కేరళలోని సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మున్నార్ లో దర్శనమిస్తోంది. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలకురింజిపూలువిరిసి చుట్టుపక్కల ప్రాంతాలలో తమ సౌరభాలను వెదజల్లుతున్నాయి. బండరాతి కొండలను సైతం వర్ణరంజితం చేస్తున్నాయి. 12 ఏళ్లకోసారి మాత్రమే పూసే నీలకురింజి పూల పుష్ప విలాసాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు మున్నార్ వస్తున్నారు.