ములుగులో కాంగ్రెస్‌కు షాక్, టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు!

ములుగు:
ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన పట్ల ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆకర్షితులవుతున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా తాము కూడా బంగారు తెలంగాణ సాధనలో భాగం అవుతామంటూ వివిధ  పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ రోజు ములుగు నియోజకవర్గంలో  రాష్ట్ర గిరిజనాభివృద్ధి , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ సమక్షంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో పాటు, వివిధ పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. గోవిందరావుపేట మండలం, చల్వాయి గ్రామంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన 300 మందికి మంత్రి చందూలాల్ స్వయంగా గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే వెంకటాపురం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు హర్జినాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి వెంకటాపురం మండల ఎంపీపీ మేకల పద్మా నర్సయ్యతోపాటు వెంకటాపురం మండలానికి చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి చందూలాల్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారికి మంత్రి చందూలాల్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మంత్రి చందూలాల్ మాట్లాడుతూ  గోవిందరావుపేట మండలంలో వివిధ పార్టీల నుంచి   టిఆర్ఎస్ పార్టీ‌లో చేరిన వారిని  పేరు పేరునా అభినందించారు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులైన వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి  చేరుతున్నారని అన్నారు. రైతుబంధు, కేసీఆర్ కిట్లు, ఆసరా పింఛన్లు, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడిపథకం , మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గిరిజన గురుకులాలు ఇలా 40కు పైగా సంక్షేమ పథకాలతో ప్రజల బతుకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసాగా నిలబడుతుందని మంత్రి చందూలాల్ అన్నారు. గోవిందరావు పేట మండలంలో 40  డబుల్ బెడ్‌రూం ఇండ్లను  మంజూరు చేసుకున్నాం త్వరలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని మంత్రి ప్రకటించారు.  వివిధ పార్టీల నుంచి వలసలు ఊపందుకోవడంతో ములుగు టీఆర్ఎస్ క్యాడర్‌ నూతనోత్తేజంతో ఉత్సాహంగా ఉండగా..కాంగ్రెస్‌ క్యాడర్‌లో నైరాశ్యం నెలకొంది.ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్, గోవిందరావుపేట మండల అధ్యక్షుడు, సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటిసి, ఎంపీటీసీలు తదితరులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.