ముల్క్ విడుదలపై మధ్యంతర స్టే.

ముంబయ్:
తాప్సీ, రిషి కపూర్, ప్రతీక్ బబ్బర్, రజత్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ ‘ముల్క్’ విడుదలపై ముంబై కోర్టు మధ్యంతర స్టే విధించింది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ డ్రామా ఆగస్ట్ 3న విడుదల కావాల్సి ఉంది. అయితే వందన పున్వానీ అనే మహిళ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న బెనారస్ మీడియా వర్క్స్ లిమిటెడ్ అనే ప్రొడక్షన్ ఏజెన్సీ తనకు అద్దె బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టిందని.. ఆ వివాదం పరిష్కారం అయ్యే వరకు సినిమా విడుదల ఆపాలని కోరుతూ కోర్టు కెక్కింది. ఈ కేసును విచారించిన ముంబై కోర్టు ముల్క్ విడుదలను నిలిపేస్తూ మధ్యంతర స్టే ఇచ్చింది.
వందన పున్వానీ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం ప్రొడక్షన్ ఏజెన్సీ ముంబైలోని ఆమె బంగ్లాను 2011లో అద్దెకు తీసుకుంది. దానిని ఆఫీసుగా మార్చుకోవాలని భావించింది. అయితే నివాస భవనాన్ని కార్యాలయంగా మార్చేందుకు స్థానిక నగర పాలక సంస్థ అనుమతినివ్వలేదు. అందుకని బెనారస్ మీడియా వందనకు అద్దె ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో 2016లో తనకు రావాల్సిన రూ.50 లక్షల అద్దె మొత్తం ఇప్పించాలని కోరుతూ పున్వానీ దిన్ దోషి సెషన్స్ కోర్టుకి వెళ్లింది. ఈ నెల మొదట్లో తన బకాయిల వివాదం పరిష్కరించే వరకు ముల్క్ విడుదల ఆపాలని కోరుతూ వందన కోర్టులో మరో పిటిషన్ వేసింది. విచారణను ఆగస్ట్ 2కి వాయిదా వేసిన న్యాయస్థానం, ముల్క్ విడుదలపై మధ్యంతర స్టే ఇచ్చింది.
అయితే దర్శకుడు అనుభవ్ సిన్హా మాత్రం వందన పున్వానీ ఆరోపణలు పచ్చి అబద్ధాలని కొట్టి పారేశారు. అయినప్పటికీ తను ఇంకా కోర్టు ఉత్తర్వులు చూడలేదని చెప్పారు. రేపు కోర్టు వివరణ చూడటమో లేదా బొంబాయి హైకోర్టుకి వెళ్లడమో చేస్తామని తెలిపారు. ముల్క్ సినిమా కథ విషయానికొస్తే… సమాజంలో ఎంతో మర్యాదస్తులుగా జీవించే ముస్లిం కుటుంబంపై దేశ ద్రోహులు అనే ముద్ర పడుతుంది. ఇరుగుపొరుగు మాటలతో పాటు మీడియా అత్యుత్సాహం తోడై ఆ కుటుంబం బాగా కృంగిపోతుంది. వీరికి ఓ లాయర్ అండగా నిలుస్తుంది. ముస్లిం కుటుంబ పెద్దగా రిషి కపూర్, లాయర్ గా తాప్సీ నటించారు.