మెడమీద ‘కత్తి’ పెట్టి బదునాం చేస్తరా..?

నాటి తెలంగాణ సాధనకోసం సాగిన పోరాటాల్లో గానీ, నేటి స్వయంపాలనా సంధికాలంలో గానీ, వొక అసంబద్ధ వైఖరి కొనసాగుతూ వస్తున్నది. అదేందంటే..ప్రాంతీయ అస్తిత్వానికి సామాజిక సాంస్కృతిక అస్థిత్వాలకు రాజకీయాలకు ముడిపెట్టి కలెగలిపి కలగా పులగం చేయడం. సామాజిక తెలంగాణ అనే వైఖరితో స్వయం పాలనలో కలిసిపోకుండా దూరం దూరం వుండడం.. పైంగ విమర్శించడం.. అనే అయోమయానికి గురవుతున్నరు కొంతమంది నాటి ఉద్యమ కారులు. ఉడికిందాక ఎదరు చూసి.. వుమ్మగిల్లిందాక ఆగలేక మూతికాల్చుకున్నట్టు.. తెలంగాణ వచ్చుడు తోనే తెలంగాణ సాధన ప్రక్రియ వొడిసిపోయినట్టు ఆగమాగమైతున్నరు కొందరు. తెలంగాణను సుస్థిరంగా బలంగా నిలవెట్టుకోవడం ద్వారా మాత్రమే తెలంగాణ సాధన ప్రక్రియ పూర్తియినట్టు లెక్క. పిల్ల పుట్టంగనే అయిపోలేదు. తన కాల్లమీద తాను నడుస్తూ, అమ్మ పాలు మరిచి, తన ముడ్డి తాను కడుగుడు నేర్చుకునేంతవరకు అమ్మ పాలన అవసరం. అట్లనే తెలంగాణ రాంగనే అయిపోలేదు. తెచ్చుకున్న తెలంగాణను నిలవెట్టుకోవాలె.
తెచ్చే బాధ్యత ఎట్లయితే ఎత్తుకున్నడో.. దాన్ని నిలవెట్టే బాధ్యత కూడా నాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కేసీయార్ ఎత్తుకున్నరు కావట్టే అంతగనం పట్టుక పడుతున్నడు. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నడు. ఈ సందర్భంలో తెలంగాణ దళిత బహుజనులుగా మన కర్తవ్యం యేంది.? తెలంగాణను నిలవెట్టే పని సిఎంకు వొక్కనికే పట్టిందా.? మనందరి బాధ్యతలేదా.? గిందుకేనా మనం ఉద్యమాలు చేసింది.? ఆనాటి మాదిరి మనం ఎందుకు చైతన్యవంతంగా ఆలోచించలేక పోతున్నం.? ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు సహకరిస్తున్నట్టు కొంతమంది మేధావి వర్గం యెందుకని సహకరంచలేకపోతున్నది.? వాల్లకు అడ్డం వచ్చే స్వీయ మానసిక ధోరణులు యేంటివి.? నాలుగేండ్ల సంది యెన్ని ఆటంకాలొచ్చినా వాటిని కేసీయార్ అధిగమించిండా లేదా.? మరి ఆపదల అండగ నిలువాల్సినోల్లు మేధావులు నాయకులు ఎన్నితీర్ల తెర్లు చేయాలని చూసినా తట్టుకోని నిలవడ్డడా లేదా.? మనోల్లే గనుక జర వోపికతోని సహకరిస్తే ఇంకెంత బలం వుండు యింకెంత ధైర్నం వుండు ముఖ్యమంత్రికి.? ఇవి నాప్రశ్నలు కావు..తెలంగాణ బహుజనం వేస్తున్న ప్రశ్నలు
అరువయేండ్లసంది తన్లాడితే..ఇయ్యాల్టికి వుడికింది తెలంగాణ బువ్వ.. వుడకనయితే వుడికింది గదా.. ఆగమాగం కాకుండా జర వుమ్మగిల్లినంత సేపు వో ఐదారేండ్ల కాలమన్న ఆగలేరా ఆ సోయేలేదాయె. అని గులుగుతున్నరు మేధావుల మీద జనం. ఇల్లుగాలి వొకడు యేడుస్తాంటే సుట్ట కాల్సుకుందానికి నిప్పుకావాలని వొకడు యేడిసినట్టు… యెట్లరో దేవుడా పాలోని పగల నడుమ, ఈ గుంట నక్కల నడుమ,ఇంటి దొంగల నడుమ తెలంగాణను నిలవెట్టుకునుడు అని వొకరోకు తిప్పలబడి యిప్పుడిప్పుడే తెలంగాణను వో దరికి చేర్చుతాంటె…వోర్వలేక ప్రపంచం మీది అన్ని సిద్దాంతాలూ దేశంలోని అన్ని వైరుధ్యాలనూ ఆంధ్రా ఛానల్ల వేదికగా హైద్రాబాద్ గడ్డమీదనే వొలకబోస్తాండ్రి. తాత్విక సిద్దాంతాల పేరుతో మనోభావాల పేరుతో లొల్లి పెట్టుకుని వాటిని చిలికి చిలికి గాలివానల్లాగా మార్చి హైద్రాబాద్ లో అశాంతి మోపు చేద్దామని సూత్తాండ్రి. తెలంగాణ వచ్చిన కొత్తల పొత్తుల రాజధాని పేరుమీద హైద్రాబాద్ ల వున్న పచ్చపార్టీ దాని అనుబంధ మీడియా ముఠాలు యిట్లసొంటియే కుట్రలు పన్ని..సెక్షన్ 8 అమలు పరిచి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేద్దామని చూసిండ్రు. కని యేమయ్యింది.? కొట్టుడు కొడితే పొయ్యి అమరావతిల తేలిండ్రు. అది అదట్ల మర్సిపోయినమో లేదో.. యిగ మతం పేరుమీద మల్లోటి మోపు చేయ సూత్తాన్రు. అంటే యేందన్నట్టు..తెలంగాణోల్లు నిమ్మలంగ బతుకొద్దా.. అటు తిప్పి ఇటుతిప్పి తెలంగాణను తెర్లు చేసే కుట్రలేనామీడియాది.? అట్ల మీరు చేత్తాంటే ఇవుతలోల్లు సూస్కుంట కూసోవాల్నా.? కత్తి మహేశ్ మాట్లాడిండా ఇంకెవలు మాట్లాడిండ్రా…పరిపూర్ణానందుడా యింకోవలా కాదిక్కడ..యెవలైనా వూకునేది లేదు. మీరు పుసపుస స్టేట్‌మెంట్లు ఇస్తరు.. మీము పీక్కుంట కూసోవాల్నా.? మీరిచ్చిందాంట్లె నీతి వున్నదా నిజాలున్నయా లేదా ఎవలిది అబద్ధం ఎవలిది నిజం.. అనే చర్చ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం పనిలేకుంటా లేదు.. అని ప్రజలు స్పష్టం చేయదల్చుకున్నరు.
ఎందుకంటే..ఇన్నాల్ల పాటు ఇసొంటి ముచ్చెట్లు పెట్టీ పెట్టీ తమకు సంబంధంలేని కొట్లాటలు నెత్తికెత్తుకోని తెర్లయింది తెలంగాణ. ఇప్పుడిప్పుడే వొక సాలుకొస్తాంది. అర్జునునికి చెట్టుమీద పిట్టకన్ను మాత్రమే అవుపడ్డట్టు.. తెలంగాణ ప్రభుత్వం దృష్టి అంతా తెలంగాణ అభివృద్ధి మీద ప్రజల బతుకులను బాగు చేసుడు మీదనే వున్నదిప్పుడు. వివేకానందుడు అన్నట్టు ..కడుపుల కాలితోనికి ముందుగాల కడుపునిండ బువ్వపెట్టాలె ..కాలే కడుపుతోని సిద్ధాంతాలు చెప్తే వానికి కడుపునిండదు..నీ ముచ్చెట వినడు. అట్లనే, మొదుగాలు తెర్లయిన తెలంగాణ నిలవడాలె అయిటంకనే యే తత్వమైన సిద్ధాంతం ముచ్చెట్లయినా..అంటుర్రు జనం.
కత్తి మహేశ్ బహిష్కరణకు గురయిండు అని బాధపడుతున్న దళిత బహుజన మేధావులు యాదికుంచుకోవాల్సిన ముఖ్యవిషయం యేందంటే… చారిత్రక గతితర్కాలు భౌతిక వాదాలు తత్వాలు సిద్ధాంతాలు తెలిసిన వాల్లుగా ఇవాల తెలంగాణ లో మనం పోషించాల్సిన పాత్ర యేంటిదో అర్థం చేసుకోవాల్సి వున్నది. ఇక్కడ వొక దళితునికి అవమానం జరిగిందని బాధ పడడం దాన్ని ఖండించడం ఎంతముఖ్యమని మీరు భావిస్తున్నరో… మొత్తంగా తెలంగాణ మెజారిటీ ప్రజలుగా వున్న దళిత బహుజనుల జీవితాలను ఆగం చేసేందుకు మోపయితున్న కుట్రలను భగ్నం చేయడం కూడా అంతే ముఖ్యమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. మీరు దాన్ని కూడా గమనించాలె.
మనకు ఈ దృష్టి కూడా వుండాలె. కత్తి మహేశ్ అంశాన్ని సామాజిక కోణంలో కాదు ఇప్పుడు చూడాల్సింది తెలంగాణ కోణంలో చూడాలె. తెలంగాణను సెంటిమెంట్ల పేర్లతో మత విద్వేశాలం నుంచి కాపాడే కోణంలో పరిశీలించాలె.. అప్పుడుమాత్రమే మన మనసు నిమ్మలమైతది. కొంతమంది దళిత బహుజన పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించినట్టు… దళితుడని కాదు కత్తిని హైద్రాబాద్ బహిష్కరణ చేసింది… మనోభావాల పేరుతో కొంతమంది స్వార్థపరులు లేవదీయాలనుకున్న చిచ్చును ఆపడానికి పోలీసు యంత్రాంగం తీసుకున్న నిర్ణయం అని గుర్తించాలె. వొక ప్రత్యేక పరిస్థితుల్లో వొక సున్నితమైన అంశాన్ని ముందలేసుకోని రాజకీయ స్వార్థంతో ప్రజల నడుమ వైషమ్యాలను రెచ్చగొట్టాలని వొక వర్గం పన్నబోతున్న కుట్రలను భగ్నం చేయడానికి తీసుకున్న నిర్ణయంగా భావించాలె తప్ప.. అది ఎవరినీ కించపరచడానికి కాదని గుర్తించాలె.
ప్రభుత్వ యంత్రాంగం ముందే పసిగట్టింది కావట్టి సరిపోయింది. కఠిన నిర్ణయమైనా అటువంటి నిర్ణయాన్ని తక్షణమే తీసుకోని అమలు పరచడం ద్వారా హైద్రాబాద్ లో వొక ప్రమాదాన్ని అడ్డుకున్నట్టయిందని తెలంగాణ దళిత బహుజనులు భావిస్తున్నరు. పనిలేనోల్లు ఇద్దరు వూల్లె లొల్లి పెట్టుకోని దాన్ని అందరికీ పూద్దామని సూస్తే దాన్ని పసిగట్టిన పెద్దమనిషులు యేం జేస్తరు.. యేయ్ యేం లొల్లిరా.. చెంపలమీంచి రొండు పెట్టి.. అటోన్ని ఇటోన్ని తోల్కపోతరు. ముందుగాల లొల్లిని ఆపుతరు.. గదే చేసిండు తెలంగాణ డిజిపి. అంతేగని యిందులో దళితకోణం గానీ యింకోటి కానీ లేదు..కేవలం శాంతి భద్రతల కోణం, తెలంగాణ కోణం మాత్రమే వున్నది అనేది నిజం. ఎందుకంటే తెలంగాణ దళిత బహుజన వర్గాల బాగోగుల గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించినంత లోతుగా ఈ దేశంలో మరే ప్రభుత్వం ఆలోచించలేదు అనేది ఇప్పటికే నిరూపితమైన సత్యం.
ముందుగాల్నే చెప్పినట్టు.. సామాజిక సాంస్క్రతిక అంశాలను ప్రాంతీయ అస్తిత్వాలకు సామాంతరంగా కాకుండా విరుద్దంగా ముడిపెట్టి చూడడంలోనే అవగాహన రాహిత్యమున్నది. తెలంగాణ వచ్చింది కని, ఇది ఇంకా పొత్తుల పేరుతో నడుస్తున్నది.. నీకో హైకోర్టు లేదు..నీకో సొంతమీడియా లేదు..నీకో సొంత సీనిమా లేదు..యిది వొక సంధి కాలం. యీ పదేండ్ల పాటు సాగే సంధికాలంలో బాధ్యతాయుతమైన ఉద్యమకారులుగా ఆచితూచి ఆలోచించాల్సిన అక్కెరున్నది. యిప్పుడే మొదలయింది అప్పుడే అయిపోయినట్టు చేయవద్దు. నాల్రోజులు ఆగితే… యెక్కడియక్కడ సదురుకుంటయి. ముందలేసుకున్న ప్రాజెక్టులు అభివృద్ధి పనులు వొక కొలిక్కి వస్తయి. జనం జర తేరుకోని పల్లెలల్ల పంటలు పండించుకోని కడుపునిండ బువ్వతినుడు సురు చేస్తరు. ప్రజల ఆకలి తీరుతది. ఇగ అప్పుడు యెన్ని సిద్ధాంతాలు చెప్తరో యే యే పురాణాలు శాస్త్రాలు రామాయణ మహాభారతాలను అరుగుల మీద కూసోని చర్చల పెడుతరో పెట్టుదురు గని, అప్పటిదాకా ఆగరాదురి. అట్లా ఆగకుంటా పైంగ తెలంగాణ ప్రభుత్వాన్నే తప్పుపట్టడం యేంది.?…అని అంటున్నరు దళిత బహుజన వర్గాలు.
యీ రాముని మీద చర్చ చేసిన టివి ఛానలూ తెలంగాణది కాదు.. అండ్ల పాల్గొని మనోభావాలు దెబ్బతీసిన పెద్దమనిషిదీ తెలంగాణ కాదు.. ఆయన వ్యాఖ్యలను రాజకీయం చేయాలని పాదయాత్ర మొదలు పెట్టిన మత పెద్దలదీ తెలంగాణ కాదు.. యెవలి రేటింగుల మీద వాల్ల యావ తప్పితే.. వీల్లకు ఆ తెలంగాణ సోయే లేదు. అయ్యో యిప్పుడిప్పుడే సచ్చి చెడీ తెలంగాణను తెచ్చుకునిరీ.. మనం యేది పడితే అది ప్రచారం చెయ్యవచ్చునా.? మనమిట్ల యేదిపడితే అది మాట్లాడవచ్చునా.? తెలంగాణను మనమిట్ల ఆగం చెయ్య చూడవచ్చునా..? అని ఎవలన్నా ఆలోచించిన్రా.. ఆలోచించలేదు.. ఆలోచించరు కూడా.
వాల్లకేం కడుపునొప్పి.? వాల్లకంత పట్టింపులేదు గనుక. వాల్లు ఆలోచించరు. మరి బహిష్కరణ చేస్తరా.. అని గుండెలు బాదుకుంటున్న తెలంగాణ పెద్దమనుషులు ఎందుకు ఆలోచిస్తలేరు అనేదే ఇక్కడ ప్రజలు వేస్తున్న ప్రశ్న. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మెడ మీద దళితులు అనే కత్తి’ పెట్టి బదునాం చేస్తమంటె ఎట్లా.? ప్రభుత్వానికి తెలంగాణను అభివృద్ధి చేసే పని అందుకు అనుసరించవలసిన కార్యాచరణే తప్ప..ప్రస్తుతానికి ఇంకో పని లేదు. ముఖ్యంగా రామాయణ మహాభారత పురాణాలను పఠించి విశ్లేషించే సమయం అంతకన్నా లేదు.