మెడికల్ సీట్ల స్పోర్ట్స్ కోటా స్కామ్,తెలంగాణలో ప్రకంపనలు.

హైదరాబాద్:
స్పోర్ట్స్‌ కోటా మెడికల్‌ సీట్ల కుంభకోణం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఒకరిని అరెస్టు చేయగా… మరికొందరిని ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. స్పోర్ట్స్ కోటాలో అర్హులకు దక్కాల్సిన వైద్య విద్యా సీట్లను అనర్హులకు అమ్ముకున్న సాట్స్ అధికారుల దందాపై ఏసీబీ సీరియస్‌గా దృష్టిపెట్టింది. సాట్స్ డిప్యూటీ డైరక్టర్ వెంకటరమణతోపాటు మరో నలుగురు ఉద్యోగుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. స్పోర్ట్స్ కోటా సీట్లలో వెల్లువెత్తుతున్న ఆరోపణలపై తనిఖీల తర్వాత సాట్స్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణను అరెస్టు చేశారు. మరోవైపు బాధిత విద్యార్ధుల వాంగ్మూలాలను సేకరిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.. సాట్స్ కుంభకోణంలో తమ తప్పేమి లేదని, కొన్ని అసోసియేషన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే ఇదంతా జరిగిందని సాట్స్ ఉన్నతాధికారులంటున్నారు. ఈ క్రమంలో ఫెన్సింగ్, రోలర్ స్కేటింగ్, యాచింగ్ అసోసియేషన్ల పెద్దలను విచారించడానికి ఏసీబీ అధికారులు సన్నద్దం అవుతున్నారు..ఎంబీబిఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలలో క్రీడాకారుల కోటా పేరుతో అక్రమాలు జరిగాయని సీఎం కార్యాలయం నుంచే ఫిర్యాదు వచ్చిన నేపధ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్‌) లోని కొంతమంది అధికారులు, ఉద్యోగులు కాసులకు కక్కుర్తి పడి అనర్హులకు క్రీడా కోటలో సీట్లు వచ్చేందుకు సహకరించారన్న అభియోగాలపై దర్యాప్తు ప్రారంభించారు.. గత నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వచ్చిన మరో ఫిర్యాదు మేరకు గత నెల 25వ తేదినే మరో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఏక కాలంలో అయిదు చోట్ల దాడులను నిర్వహించారు. వేర్వేరు బృందాలుగా ఏర్పడిన అధికారులు ఎల్‌బీ స్టేడియంలోని క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంతో పాటు ఎల్‌బీనగర్‌, సరస్వతీ నగర్‌ తదితర ప్రాంతాలలోని అధికారుల నివాసాలపై దాడులను జరిపారు. సైక్లింగ్‌ కోచ్‌ గుర్రం చంద్రారెడ్డి నివాసంలోనూ సోదాలను నిర్వహించిన అధికారులు విలువైన డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా సాట్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరమణ, అడ్మినిస్ట్రేషన్‌ అధికారి విమలాకర్‌ రావు, స్పోర్ట్స్‌ కమిటీ సభ్యురాలు శోభ ఇళ్లలో సైతం సోదాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కీలక ఫైళ్లు, హార్డ్‌ డిస్క్‌లతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.వాస్తవానికి వైద్య కోర్సులలో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో కోర్సులలో చేరాలనుకునే వారు ఎంతో కష్టపడి చదివి ర్యాంకులు సాధించి సీట్లను సంపాదించుకుంటున్నారు. ర్యాంకులు రానివారిలో కొంతమంది అడ్డదారుల్లో వైద్య కోర్సులలో ప్రవేశాలకు అర్రులు చాస్తున్నారు. ఇలాంటి వారి ఆరాటాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది పక్కా స్కెచ్ వేశారు.. 2017-18 సంవత్సరంలో జరిగిన వైద్య సీట్ల భర్తీ సందర్భంగా తెలంగాణరాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలోని కొంత మంది అధికారులు ఇలా కాసులకు కక్కుర్తి పడి స్పోర్ట్స్‌ కోటాను దుర్వినియోగం చేశారు. క్రీడల్లో అర్హత లేకపోయి నప్పటికీ అర్హత ఉన్నట్లుగా సర్టిఫికెట్లను జారీ చేయడం వల్ల అనర్హులైనవారు క్రీడల కోటాలో వైద్యవిద్య సీట్లు పొందినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు భరత్‌చంద్రారెడ్డి, హర్షితారాజ్‌లు ఫిర్యాదు చేశారు. క్రీడాప్రాధికార సంస్థలో పని చేస్తున్న కొంత మంది డబ్బులు తీసుకుని అనర్హులకు స్పోర్ట్స్‌ కోటాలో సీట్లు వచ్చేందుకు సహకరించారని ఏకంగా ముఖ్యమంత్రికే పిర్యాదు అందింది. ఈ ఫిర్యాదులపై కేసులను నమోదు చేసి దర్యాప్తు జరపాలని ఏసీబీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. భరత్‌చంద్రారెడ్డి, హర్షితారాజ్‌లు ఇచ్చిన ఫిర్యాదులపై వాస్తవాలను నిగ్గు తేల్చాలంటూ సీఎం రెండు కమిటీలను ఏర్పాటు ఛేశారు. అయితే ఈ రెండు కమిటీలు ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయాయి. కాళోజి నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని వైద్య కళాశాలల్లో దాదాపు 2000 సీట్లున్నాయి. రిజర్వేషన్లలో భాగంగా స్పోర్ట్స్‌ కోటాకు 0.5 శాతం కింద 10 సీట్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం మెరిట్‌ క్రీడాకారులకు సీట్లివ్వాలి, కానీ తొమ్మిది మంది సాట్స్‌ అధికారులు వారికి నచ్చిన వారికే సీట్లు అమ్ముకున్నారు. అనర్హులకు సైతం సీట్లు వచ్చేలా సహకరించారు. దీంతో అర్హులైన వారికి అన్యాయం జరిగింది. ఇవాన్‌జెలిన్‌ అనే క్రీడాకారిణికి సంబంధించిన వివరాలను ఆర్చరీ అసోసియేషన్‌ సభ్యులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆమెకు రావాల్సిన మెడికల్‌ సీటు వేరే వారికి కట్టబెట్టారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సాట్స్‌లో జరుగుతున్న అంశాలను రెండు కమిటీలు గుర్తించడంలో వైఫల్యం చెందాయి. దీంతో ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుందన్న ఉద్దేశ్యంతో సీఎం ఏసీబీకి ఆ బాధ్యత అప్పగించారు. దీంతో రంగంలో దిగారు ఏసీబీ అధికారులు.. మరోవైపు కొన్ని క్రీడా అసోసియేషన్లు చేస్తున్న తప్పులకు తాము బలవుతున్నామని సాట్స్ ఎండి దినకర్ బాబు అంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కొత్త విధానాలు రూపొందించబోతున్నామని అన్నారు.